ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల నిజామాబాద్ రహదారిపై చల్ గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు.
నిజామాబాద్ - జగిత్యాల ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో
దిశ, జగిత్యాల రూరల్ : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల నిజామాబాద్ రహదారిపై చల్ గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా మార్కెట్ యార్డులో నిలువ ఉంచిన ధాన్యం తడిసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అకాల వర్షాల కారణంగా ఇప్పటికే నష్టపోయిన రైతులను కొనుగోళ్లలో జాప్యం కారణంగా మరింత నష్టపోయే విధంగా చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
వర్షాకాలం మరో పంట వేసే సమయంలో పొలం దగ్గర ఉండాలో లేక కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాలో అర్థం కాక సతమతం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా వాతావరణం లో వస్తున్న మార్పులతో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందని అన్నారు. వర్షం వస్తే ధాన్యం పై కప్పడానికి పరదాలు కూడా లేవని అన్నారు. అతిపెద్ద కొనుగోలు కేంద్రమైన చల్ గల్ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం తూకం వేయడానికి సరిపడా కాంటాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయిశ్చర్ వచ్చినా కూడా ధాన్యం కొనడం లేదని మళ్లీ వర్షం పడే అవకాశం ఉన్నందున రెండు రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి రైతు నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి మద్దతు తెలిపారు.
భారీగా నిలిచిన ట్రాఫిక్...
రైతుల నిరసనతో జగిత్యాల నిజామాబాద్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిరసన తెలుపుతుండగా వచ్చిన అంబులెన్స్ కు దారి ఇచ్చిన రైతులు ఆ తర్వాత ధర్నాని కొనసాగించారు.సుమారు రెండు గంటలకు పైగా చేసిన నిరసన కార్యక్రమంతో వాహనదారులు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ రైతులకు నచ్చజెప్పడంతో నిరసన విరమించారు.