ప్రతి బాలిక మరొకరికి స్ఫూర్తిదాయకం కావాలి

ప్రతి బాలిక మరొకరికి స్ఫూర్తిదాయకం కావాలని, ఆ దిశగా నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

Update: 2024-10-19 11:12 GMT

దిశ, కరీంనగర్ : ప్రతి బాలిక మరొకరికి స్ఫూర్తిదాయకం కావాలని, ఆ దిశగా నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11న నిర్వహించాల్సిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు దసరా సెలవుల కారణంగా వాయిదా పడ్డాయి. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అంతరిక్షంలోకి వెళుతున్నారని గర్వంగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో భ్రూణ హత్యలు జరగడం బాధాకరమన్నారు. ప్రతి రంగంలో మహిళలు ఉన్నప్పటికీ వారి పట్ల చిన్నచూపు ఇంకా తగ్గలేదన్నారు. యుక్త వయసు రాగానే బాలికకు సమాజం పట్ల భయాన్ని నూరిపోస్తున్నామని తెలిపారు.

    జీవితంలో బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని, చదువు ఒక్కటే ఎదగడానికి మార్గమని తెలిపారు. ప్రతి బాలిక మరో బాలికకు అవసరమయ్యే సహాయం చేయాలని సూచించారు. మహిళకు సానుభూతి అవసరం లేదని, సాహసంతో ముందుకు సాగాలని సూచించారు. బాలుడికి ఇచ్చే ప్రోత్సాహాన్ని, అవకాశాన్ని బాలికకు కూడా ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు. తల్లికి మించిన దైవం లేదని, ఏ సమస్య వచ్చినా తల్లికి చెప్పాలని, ఆమె మాట వినాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి చిన్న అవకాశాన్ని బాలిక సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

    అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి మాట్లాడుతూ బాలికల పట్ల వివక్ష కుటుంబం నుంచి మొదలవుతుందని, ఆ దురాచారాన్ని వీడాలని అన్నారు. ఆడపిల్ల ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళలు కుటుంబం కోసం త్యాగాలను తగ్గించి తమ ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి బాలికా సంరక్షణ చట్టాల పట్ల అవగాహన కల్పించారు. బాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, జిమ్నాస్టిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీలత, సీడబ్ల్యూసీ సభ్యురాలు రాధ, వివిధ పాఠశాలల నుంచి హాజరైన బాలికలు పాల్గొన్నారు.

Tags:    

Similar News