కోతుల దాడిలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
ఎండపల్లి మండల కేంద్రంలో శుక్రవారం కోతులు దాడి చేయగా ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
దిశ, వెల్గటూర్ : ఎండపల్లి మండల కేంద్రంలో శుక్రవారం కోతులు దాడి చేయగా ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన గుర్రం సూరవ్వ, రేణికుంట అమ్మాయి అనే ఇద్దరు మహిళలు తమ ఇంటి వద్ద పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా కోతుల మంద వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళలను తొలుత ఆంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన మారం భూంరెడ్డి, మారం లింగారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై వారం రోజుల క్రితం దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇప్పుడిప్పుడే కోలు కుంటున్నారు. గ్రామంలో నిత్యం ఏదో ఓ చోట ప్రజలపై కోతులు దాడి చేస్తూనే ఉన్నా పట్టించుకునే వారే లేరని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు కోతులను గ్రామం నుంచి అడవికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.