అంగన్వాడీల్లో సృజనాత్మక కార్యక్రమాలు
పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే ఎన్నో కార్యక్రమాలు అంగన్వాడీలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
దిశ, గంగాధర : పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే ఎన్నో కార్యక్రమాలు అంగన్వాడీలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గంగాధర మండలంలోని కాచ్చిరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళా సమస్యలన్నింటికీ శుక్రవారం సభ ఒక పరిష్కార వేదికగా నిలుస్తుందని అన్నారు. మహిళలు తమ సమస్యలు ఏమైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని, గర్భిణి మహిళలకి తమ బీపీ, హిమోగ్లోబిన్, బరువు ఎంత ఉండాలి తెలిసి ఉండాలన్నారు. మహిళలు సమతూల్య ఆహారం తీసుకుంటే మందులు, హాస్పిటల్ అవసరం ఉండదు అన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని సూచించారు.
శుక్రవారం సభకు హాజరైన గర్భిణీ, బాలింతలతో వారి అనుభవాలను చెప్పించారు. ప్రతి గర్భిణీ, బాలింత శుక్రవారం సభకు తప్పక హాజరు కావాలని కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మహిళలందరికీ సుమారు 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, వీటిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రాథమిక విద్యతో పాటు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూడీఓ సబితా, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, డీఎంహెచ్వో వెంకటరమణ, ఎమ్మార్వో అనుపమ, సీపీడీఓ కస్తూరి. ఏసీపీడీఓ నర్సింగరాణి, ఎంపీఓ జనార్దనరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ జోగు లక్ష్మిరాజ్యం(సాగర్), పంచాయతీ కార్యదర్శి జయాకర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ శ్వేతా, ఏపీఎం పవన్, డీసీ నాగరాజు , బీసీ సఖి లక్ష్మి, సీడీపీఓ పర్వీన్, చైల్డ్ లైన్ సంపత్, ఎమ్మెస్కే శ్రీలత, సూపర్వైజర్ రేణుక, అంగన్వాడీ టీచర్ గౌతమి, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.