ఆర్టీవో ఉద్యోగులు నిజాయితీగా ఉండాలి.. డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ పురుషోత్తం..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధిః వాహనదారులు పెండింగ్ లో ఉన్న పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలని డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ కమిషనర్ పురుషోత్తం సూచించారు. మంగళవారం సిరిసిల్ల రోడ్డు రవాణా కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డిటిసి పురుషోత్తం మాట్లాడుతూ త్రైమాసిక పన్నులు సకాలంలో చెల్లించేలా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, వాహనదారులు సకాలంలో పన్నులు చెల్లించి రోడ్డు రవాణా అధికారులకు సహకరించాలని కోరారు. అలాగే ఈమధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ గా రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు రవాణా కార్యాలయ అధికారులు సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనువైన చోటుకి సిరిసిల్ల ఆర్టీవో కార్యాలయం
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీవో కార్యాలయం అనువైన ప్రదేశంలో లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు డిటిసి పురుషోత్తం తెలిపారు. ఇరుకైన ప్రదేశంలో ఉండటం వల్ల చుట్టుపక్కల నివసించే వారు ఇబ్బందులు పడుతున్నారని, తనకు ఫిర్యాదులు కూడా వచ్చాయన్నారు. దానికి తోడు గ్రౌండ్ కూడా కార్యాలయ సమీపంలో లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. సిరిసిల్ల ఆర్టీవో కార్యాలయాన్ని అనువైన ప్రదేశానికి మార్చడమే ఈ ఆకస్మిక తనిఖీ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. అతి త్వరలో సకల సౌకర్యాలు ఉన్న ప్రదేశానికి కార్యాలయాన్ని మారుస్తామన్నారు. తనిఖీలో డీటీవో లక్ష్మణ్ తో పాటు కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.