బీసీ హాస్టల్ ను తనిఖీ చేసిన ఎంపీ
విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశి కృష్ణ అధికారులను ఆదేశించారు.
దిశ, గోదావరిఖని : విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశి కృష్ణ అధికారులను ఆదేశించారు. గురువారం గోదావరిఖని ప్రశాంత్ నగర్ లోని జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. తరగతి గదులు, వాష్ రూమ్స్, భోజన శాల పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాష్ రూమ్స్ శుభ్రంగా లేకపోవడంతో స్కూల్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చదువుతో పాటు భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు పేరు తేవాలని సూచించారు. ఈ మధ్య ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగాయని, హాస్టల్లో తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి నా సహాయ సహకారాలు అందించి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.