ఆధునిక హంగులతో జిల్లా పోలీస్ కార్యాలయం

ఆధునిక హంగులతో నూతన సాంకేతికతతో జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మించినట్టు రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు.

Update: 2024-11-20 15:08 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఆధునిక హంగులతో నూతన సాంకేతికతతో జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మించినట్టు రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నుండి వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీజీపీ డాక్టర్ జితేందర్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ఇందులో భాగంగా మొదట ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ఆఫీస్ రిబ్బన్ కట్ చేసి నూతన జిల్లా పోలీస్ కార్యాలయంను వేద మంత్రాల మధ్య ప్రారంభోత్సవం చేశారు.

    గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎస్పీ ఛాంబర్ ను సందర్శించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను సీటులో కూర్చో బెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం డీజీపీ జితేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి గుడి చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారని తెలిపారు. నేటి నుండే ఈ నూతన కార్యాలయ సేవలు ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల సంరక్షణలో దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ పోలీసింగ్ నిలుస్తుందని, సాంకేతికత దన్నుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీస్ శాఖ ముందంజలో ఉందన్నారు.

     పోలీసు వ్యవస్థలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన భద్రత వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే అంశంలో వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయని, ప్రజలకు మేలు చేసే ఫాలసీల, వ్యవస్థల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ భవనం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ, ఆర్ఐలు, సీఐ లు, ఎస్ఐ లు, డీపీఓ సిబ్బంది, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News