ఇచ్చిన మాటను నేరవేరుస్తున్న సీఎం
గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వేములవాడకు వచ్చి ఇచ్చిన మాటని విస్మరిస్తే, ప్రజా ప్రభుత్వం ఏర్పడితే ఆలయ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని ఆనాడు చెప్పిన మాటని నేడు నెరవేరుస్తున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
దిశ, వేములవాడ : గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వేములవాడకు వచ్చి ఇచ్చిన మాటని విస్మరిస్తే, ప్రజా ప్రభుత్వం ఏర్పడితే ఆలయ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని ఆనాడు చెప్పిన మాటని నేడు నెరవేరుస్తున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజీ 2 ఫేస్ 1 లో మర్రిపెల్లి చెరువు, లచ్చంపేట తండా, రుద్రంగి, కలికోట సూరమ్మ ప్రాజెక్టులకు అండగా ఉంటామని ఇచ్చిన మాట, కాళేశ్వరం ప్యాకేజీ 9లో పేరుకుపోయిన పనులు పూర్తి చేసేందుకు రూ.320 కోట్లతో పనులకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.
రూ.1000 కోట్లకు పైగా నిధులను వేములవాడ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. వేములవాడ అభివృద్ధి కోసం ప్రతి శాఖ మంత్రి సంపూర్ణ సహకారం అందించారు. ముఖ్యమంత్రి హామీ మేరకు మిడ్ మానేర్ నిర్వాసితులకు 4969 మందికి రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని, రూ.76 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు శృంగేరి పీట అధిపతుల సూచనల మేరకు నిర్వహిస్తున్నాం అన్నారు. పట్టణ వాసుల చిరకాల కోరిక రోడ్డు విస్తరణ పనులకు రూ.47 కోట్లతో భూమి పూజ చేశామన్నారు.
గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ నూలు డిపో మంజూరు కాలేదని, నేడు ప్రజా ప్రభుత్వంలో చేనేత క్లస్టర్ గా ఉన్న వేములవాడ పట్టణంలో రూ.50 కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేస్తున్నామని, గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలకు బకాయి పడ్డ రూ.275 కోట్లలో రూ.203 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. యువతకు నైపుణ్యాలు అందించేందుకు రుద్రంగి కు రూ.42 కోట్లతో ఏటీసీ సెంటర్ మంజూరైందని, మేడిపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేసి, వేములవాడలో రూ.35 కోట్లతో అన్నదాన సత్ర భవనం మంజూరు చేసినట్లు తెలిపారు.