వేములవాడలో యార్న్ డిపో ప్రారంభం
స్థానికంగా ఏర్పాటు చేసిన యార్న్ డిపోను సీఎం రేవంత్ బుధవారం ప్రారంభించారు.
దిశ, వేములవాడ : స్థానికంగా ఏర్పాటు చేసిన యార్న్ డిపోను సీఎం రేవంత్ బుధవారం ప్రారంభించారు. దీంతో నేతన్నల 30 ఏళ్ల కల నెరవేరినట్టయింది. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి యార్న్ డిపో. రూ. 50 కోట్లతో నిర్మించనున్న ఈ యార్న్ డిపోను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు యార్న్ ను పంపిణీ చేశారు. దీంతో నేతన్నలకు దళారులు, మధ్యవర్తుల బెడద తప్పి క్రెడిట్ విధానంలో నేరుగా నేతన్నలకు, ఆసాములకు నూలు లభించనుంది.
ప్రజాపాలన విజయోత్సవాలు
వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వేములవాడ ఆలయ అభివృద్ధి, పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం, మేడిపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భూమి పూజ, రుద్రంగిలో ఏటీసీ సెంటర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. వీరికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు.