నేర ప్రవృత్తి గల అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత

Update: 2024-12-24 07:51 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కేంద్ర మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గుజరాత్ నుంచి వచ్చిన "తడిపార్" నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అంటూ ఫైరయ్యారు. నేరపూరితమైన ఆలోచన విధానం కలిగిన అమిత్ షా ను కేంద్ర మంత్రి వర్గంలోకి ప్రధాన మంత్రి మోడీ ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అందువల్లనే మోడీ ప్రధానమంత్రి అయ్యాడని మాట్లాడారు.

ఆర్థిక నేరస్థులైన అంబానీ అదానీలకు కొమ్ముకాసే విధంగా బీజేపీ ప్రభుత్వం ఉందని పార్లమెంట్ లో వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఒత్తిడి తెస్తున్న తరుణంలో అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి అంబేద్కర్ నిజంగానే దేవుడని అలాంటి గొప్ప వ్యక్తి పట్ల చులకనగా మాట్లాడిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా కు మంత్రివర్గంలో కొనసాగే నైతిక హక్కు లేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల మొత్తం భారత జాతికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. కలెక్టర్ కు ఫిర్యాదు అందజేసిన వారిలో డీసీసీ ప్రెసిడెంట్,ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు, మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.


Similar News