ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే మనందరి లక్ష్యం : జిల్లా ఎస్పీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జరిగే ఎన్నికలకు
దిశ,సిరిసిల్ల : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జరిగే ఎన్నికలకు పటిష్ట నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత పొలీసుల నిర్వహించాల్సిన బందోబస్తు విధులపై ఎస్పీ గారు పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల వేళ రూట్ బందోబస్తు, పోలింగ్ స్టేషన్ బందోబస్తు, పెట్రోలింగ్ పార్టీ పోలీసులు నిర్వహించాల్సిన విధులను తెలియజేశారు.
భద్రతా ఏర్పాట్లు ఇలా.....
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట భద్రత చర్యలు చేపట్టామని, జిల్లాలో ఉన్న 560 పోలింగ్ కేంద్రాల్లో సుమారుగా 1700 మందికి పైగా భద్రతా విధులలో పాలుపంచుకోనుండగా ఇందులో ఎస్పీ-01,ఆదనపు ఎస్పీ-01,డీఎస్పీ లు- 05,ఇన్స్పెక్టర్ లు 16,ఎస్.ఐ లు 34,జిల్లా సిబ్బంది(ఏఎస్ఐ నుండి హోమ్ గార్డ్ వరకు సివిల్, ఆర్ముడ్ సిబ్బంది) - 700, కేంద్ర బలగాలు - 480, బెటాలియన్ సిబ్బంది - 42, సిఆర్పిఎఫ్ సిబ్బంది - 52,మహారాష్ట్ర కు చెందిన హోమ్ గార్డ్స్ 450, ప్రత్యేక బృందాలతో కూడిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. అంతే కాకుండా రూట్ మొబైల్స్ - 53, క్విక్ రియాక్షన్ టీమ్స్ (క్యూఆర్టి)-13, స్ట్రయికింగ్ ఫోర్స్-13 మరియు స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ 02 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పోలింగ్ స్టేషన్ల వద్ద విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి సూచనలు
పోలింగ్ స్టేషన్ లో ఈవీఎంల భద్రత, ఎన్నికల సామాగ్రి భద్రతా, పోలింగ్ పూర్తయిన తర్వాత తిరిగి పంపే అంత వరకు అప్రమత్తంగా ఉండాలి. ఆదేశాలు వచ్చేవరకు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళరాదని, ఉదయం 6 గంటలకు మార్క్ పోలింగ్ ఉన్నందున అధికారులు సిబ్బంది ఆరు గంటల లోపు యూనిఫాంలో విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహించే వారు ప్రిసైడింగ్ అధికారి అనుమతి లేనిది పోలింగ్ కేంద్రం లోకి వెళ్ళ రాదని, అత్యవసర సమయంలో ప్రిసైడింగ్ అధికారి ఆదేశాల మేరకు మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఓటు వేసిన వారిని కేంద్రం నుంచి బయటకు పంపించాలన్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకోగానే పోలింగ్ కేంద్రం చుట్టూ పరిశీలించాలి, మరియు 100 మీటర్స్, 200 మీటర్ లైనింగ్ వేయించాలని సూచించారు.