Collector Sandeep Kumar Jha : మెరుగైన వైద్య సేవలు అందించాలి
వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే
దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సిరిసిల్ల పట్టణం పీఎస్ నగర్ లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఔట్ పేషెంట్ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇన్ పేషెంట్ బెడ్స్, తదితర వాటిని పరిశీలించారు. ప్రతిరోజూ ఎంత మంది రోగులు ఆరోగ్య కేంద్రానికి వస్తారో, ఎలా వైద్యం అందిస్తారని, ఎన్ని శాంపిల్స్ ను టీ హబ్ కు పంపిస్తారనే వివరాలను సంబంధిత మెడికల్ ఆఫీసర్ ను అడిగి కలెక్టర్ ఆరా తీశారు.
వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని, వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ కేసులపై కలెక్టర్ ఆరా తీశారు. ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయో, ఎంత మంది మెరుగయ్యారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఏఎన్ఎం లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. క్రమం తప్పకుండా ఏఎన్సీ చెకప్ లు చేయాలని ఆదేశించారు. తనిఖీలో కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న, సిబ్బంది ఉన్నారు.