దళితుల హక్కులను కాలరాస్తున్న సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

భారత రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కులను సీఎం కేసీఆర్ కాలరాస్తున్నారని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Update: 2023-06-04 13:30 GMT

కాంగ్రెస్ హయాంలోనే దళితులకు పెద్దపీట

దిశ, జగిత్యాల ప్రతినిధి : భారత రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కులను సీఎం కేసీఆర్ కాలరాస్తున్నారని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని పలువురు యువకులు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ దళితులకు పదవుల్లో మొండి చేయి చూపారని ముఖ్యమంత్రి పదవి,మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేయడం లేదని అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని దళిత సమాజం పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. 2022-23 లో ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎస్సీ లకు నిధులు కేటాయించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అధ్వర్యంలో ఎస్సీ సబ్ ప్లాన్ రూపొందించిందనీ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే దళితులకు పెద్దపీట వేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు, యూత్ కాంగ్రెస్ జిల్లా విభాగం అద్యక్షుడు గుండా మధు, లైశెట్టి విజయ్, తిపిరెడ్డి బాపు రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపేల్లి దుర్గయ్య, గంట వేణు రావు, కుక్కునూరీ వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News