BREAKING: కొండగట్టుకు ఆధ్యాత్మిక శోభ.. దీక్ష విరమణకు తరలిరానున్న మాలధారణ భక్తులు
హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రమైన కొండగట్టులో నేటి నుంచి జూన్ 1 వరకు జయంతి ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించబోతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రమైన కొండగట్టులో నేటి నుంచి జూన్ 1 వరకు జయంతి ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న హనుమాన్ మాలధారణ భక్తులు దీక్ష విరమణకు ఆలయానికి పెద్ద సంఖ్యలో రానున్నారు. ఈ క్రమంలోనే శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయానికి వచ్చే భక్తులకు మొత్తం 4 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించామని ఆయన తెలిపారు.
అదేవిధంగా కొండపైకి చేరుకునేందుకు గాను భక్తులకు 4 ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రస్తుతం ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్జిత సేవలు, వాహన పూజలను పూర్తి రద్దు చేస్తున్నామని ప్రకటించారు. మాలధారణ భక్తుల దీక్షను విరమించేందుకు సుమారు 300 మంది అర్చకులను పురమాయించామని, తలనీలాల సమర్పణ కోసం 1,500 నాయి బ్రాహ్మణులను అందుబాటులో ఉంచామని ఈవో చంద్రశేఖర్ తెలిపారు.