బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు మహిళా లోకం నడుం బిగించాలి: బొమ్మ జయశ్రీ

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేండ్లు గడిచిన.. మహిళల అభ్యున్నతి కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడం కేసీఆర్ ప్రభుత్వానికే చెల్లిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ విమర్శించారు.

Update: 2022-12-26 16:57 GMT

దిశ, కరీంనగర్ టౌన్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేండ్లు గడిచిన.. మహిళల అభ్యున్నతి కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడం కేసీఆర్ ప్రభుత్వానికే చెల్లిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అధ్యక్షతన కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన బొమ్మ జయశ్రీ మాట్లాడుతూ.. మహిళల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో మహిళా సమాజానికి అర్థమైందన్నారు. మహిళల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సమస్యల సాధన కోసం మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని జయశ్రీ పిలుపునిచ్చారు.

గత రెండు పర్యాయాల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మహిళల ఓట్లను రాబట్టుకోవడానికి మోసపూరిత హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చి.. హామీలు, వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా వృద్ధాప్య మహిళ, వితంతు, ఒంటరి మహిళ పింఛన్లను మంజూరు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే మహిళలకు అన్ని రకాల పింఛన్లను తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే.. అన్ని వర్గాలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు రక్షణ, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన దాఖలాలు లేవని, అనేకమంది మహిళా ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. మద్యం మత్తులో మహిళలను కించపరిచే సంఘటనలు అధికమవుతున్నాయని, వెంటనే గ్రామాల్లో మద్యం అమ్మకాలు అరికట్టాలన్నారు. మద్యం విధానంపై ప్రభుత్వం పున పరిశీలన చేయాలని, డ్రగ్స్, గంజాయి సరఫరాపై దృష్టి సారించి, నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News