పల్లెల్లో బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు

గ్రామాల్లో బెల్ట్‌షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు రాత్రింబవళ్లు మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌ షాపులు వెలుస్తున్నాయి.

Update: 2024-10-07 03:02 GMT

దిశ, సైదాపూర్ : గ్రామాల్లో బెల్ట్‌షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు రాత్రింబవళ్లు మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌ షాపులు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. అనేక మంది బెల్ట్‌ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కాపురాలు వీధి పాలవుతున్నాయి. మండలంలోని అధికారిక వైన్ షాప్‌కు నిత్యం వచ్చే మద్యం ప్రియులకు ఎంఆర్పీ ధరకు అమ్మకాలు చేస్తున్నారు. కానీ సిండికేట్ కారణంతో విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపు నిర్వాహకులు క్వార్టర్ పై రూ.30, హాఫ్ పై రూ. 60 ఫుల్ పై రూ. 120 బీర్ పై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్స్ షాపుల్లో ఉండే ప్రతి ఒక బ్రాండ్ మద్యం బెల్ట్ షాపుల్లో ఉండటం గమనార్హం. ప్రతి ఒక్క గ్రామంలో వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టడంలో ఆంతర్యమేంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంబంధిత ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు కేవలం గుడుంబా స్థావరాలపై దృష్టి పెట్టడంతో పరోక్షంగా బెల్ట్ షాపుల నిర్వాహకులను పెంచి పోషించినట్లుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో ఎనీ టైం మద్యం

పట్టణ ప్రాంతాల్లో రాత్రి సమయంలో మద్యం దొరుకదు. కానీ మండల కేంద్రంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఏ మధ్య రాత్రి అయిన బెల్ట్ షాప్ తలుపు తట్టితే చాలు ఏటీఎం లాగా కావలసిన మద్యం ప్రత్యక్షం అవుతుంది. ధర ఎంతైనా పర్వాలేదు అన్నట్లు మద్యం ప్రియుల వ్యవహారం ఉంది. ఏది ఏమైనా గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వాకంతో ప్రధానంగా యువత పెడ దారిలో పయనిస్తోంది. ఎంతో విలువైన తమ భవిష్యత్తును అబాసుపాలు చేసుకుంటున్నారు. గ్రామాల్లో మధ్య రాత్రి మద్యం అమ్మకాలు చేయడం వలన యువత మత్తులో ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పేరుకు కిరాణం.. అమ్మేది మద్యం సీసాలు

మండలంలోని పలు గ్రామాలలో ఎక్కువ మంది పేరుకు కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరీ విక్రయిస్తున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు మద్యం ప్రియులు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపుల కారణంగా మద్యం ఏరులై పారుతోంది.

పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు..

విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తుండటంతో యువత పెడదారి పడుతోంది. ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు విపిస్తున్నాయి.

సెలవు దినాల్లో జోరుగా విక్రయాలు..

స్వతంత్ర, గణతంత్ర, గాంధీ జయంతి తదితర సెలవు రోజుల్లో ముందు రోజే బెల్ట్ షాపుల నిర్వాహకులు ఆటోలలో లక్షల విలువ చేసే మద్యం స్టాక్ తీసుకుని వచ్చి సెలవు దినాల్లో ఎలాంటి భక్తి, భయం లేకుండా మద్యం విక్రయాలను సాగిస్తున్నారు. ఇదంతా సాగుతున్న సంబంధిత అధికారులు అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


Similar News