కేటీఆర్ గంభీరం వెనుక బేలతనం
కేటీఆర్ శనివారం సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన గంభీర్యమైన మాటల వెనక బేలతనం ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కేటీఆర్ శనివారం సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన గంభీర్యమైన మాటల వెనక బేలతనం ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. న్యాయ నిపుణులను పక్కన పెట్టుకొని కూడా తాను భయపడుతూ తన పార్టీ నాయకులను భయపడవద్దని చెప్తున్నాడని, ఈ కారు రేసు కేసులో తాను లాయర్ ను పెట్టుకొని ముందుగానే హైకోర్టు మెట్లు ఎక్కాడన్నారు. కేటీఆర్ పట్టణాన్ని కబ్జా చేస్తూ తన అనుచరులను పల్లెలు కబ్జా చేయమని చెప్పారని, సిరిసిల్లలో 10 రకాల భూములు కబ్జాకు గురి అయ్యాయని ఆరోపించారు. వారు కట్టిన తెలంగాణ భవన్ కూడా కబ్జా భూమిలోనే కట్టారో లేదో చెప్పాలని సవాలు విసిరారు.
తెలంగాణ భవన్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఒక ఎకరం మాత్రమే ఇచ్చిందని, కేటీఆర్ చిత్తశుద్ధి ఉంటే ఆక్రమించిన మిగిలిన భూమిని తిరిగి అప్పగించి తమ నాయకులకు ఆదర్శంగా నిలవాలని హితవు పలికారు. భావితరాలకు ఉపయోగపడే భూములను అప్పనంగా మింగేశారని, సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని 1000 ఎకరాలు, జిల్లా మొత్తం సుమారు 2000 ఎకరాల వరకు కబ్జా చేశారని మండిపడ్డారు. ఆధారాలతో సహా ఆయా పత్రికలు రాస్తే, వాటిని అబద్ధాలు అనడంతో పాటు ఆయా ప్రతినిధులు, సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని, తన వరకు వస్తే కక్ష సాధింపు చర్యలు అంటున్నాడని, స్వచ్ఛందంగా కబ్జా చేసిన భూములను తిరిగి ఇస్తుంటే ఆపడానికి నువ్వెవరు అని ప్రశ్నించారు.
ప్రజల ఆస్తులను కాపాడి అర్హులైన వారికి అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యామని, ఇప్పటికే కబ్జా అయిన ప్రభుత్వ భూమిలో 200 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, గోర్లు, బర్లు, చేపలు ఇలా ప్రతి పథకంలో కుంభకోణాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపి దిగిపోయారని అన్నారు. ప్రస్తుతం నెలకు రూ.600 కోట్ల అప్పు కట్టే పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. అతలాకుతలమైన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు ముందుకు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన విధానంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. కేటీఆర్ చీటికిమాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.