కేసీఆర్‌వి అన్నీ థర్డ్ క్లాస్ బుద్దులే: Bandi Sanjay
జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడని బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం...Bandi Sanjay hits out at CM KCR During Padayatra
దిశ, మల్లాపూర్ /జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడని బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంజయ్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చైనా బజార్లు ఎక్కువగా అవుతున్నాయంటూ అనడం పట్ల తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. కేసీఆర్ కి అన్ని థర్డ్ క్లాస్ బుద్ధులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూర్ పాక్ అంటే మైసూర్ లోనే తయారు చేస్తారా లేక ఇరానీ ఛాయ్ అంటే ఇరాన్ నుండి వస్తుందా అని ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రతో ఫామ్ హౌస్ లో పడుకున్న ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ కి తీసుకొచ్చామని, ఇప్పుడు అదే దెబ్బతో ప్రగతిభవన్ నుండి జగిత్యాలకు వచ్చాడన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబం చేస్తున్న అవినీతితో రాష్ట్రం అప్పలపాలవుతుందని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు లేని డబ్బులు సీఎం ఫామ్ హౌస్ లు కట్టుకోవడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయని, 8 నెలల్లో సీఎం 100 రూములతో ఇళ్ళు ఎలా కట్టుకున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలన్నారు.
ధాన్యం కొనుగోళ్ల దగ్గర నుండి ఉపాధి హామీ పథకం వరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలలో కేంద్రం వాటా ఉంటుందని, తెలంగాణలో అభివృద్ధి కేంద్రం ఇచ్చే నిధులతోనే జరుగుతుందని అన్నారు. వరి వేస్తే ఉరే అని చెప్పి సన్నవడ్లు, దొడ్డువడ్లు అంటూ రైతులను కేసీఆర్ ఆగం చేసిండన్నారు. ధాన్యం కొనుగోలులో నిధులన్నీ కేంద్రానివేనని కేసీఆర్ చేస్తున్నది బ్రోకరిజం మాత్రమే అని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే 'ఫసల్ బీమా యోజన' పథకాన్ని తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేసి, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో డిస్కంలు 60 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని ప్రభుత్వ కార్యాలయాల నుంచి డిస్కంలకు బాకీ ఉన్న 18 వేల కోట్ల రూపాయలను ఇప్పటివరకు చెల్లించలేదని ఆరోపించారు. పాతబస్తీలో 1000 కోట్ల కరెంట్ బిల్లులను వసూలు చేసే దమ్ము కేసీఆర్ కు లేదని విమర్శించారు.