మళ్లీ డిఫాల్టర్లకే.. ఎగ్గొట్టిన మిల్లులకు సీఎంఆర్ కేటాయింపు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్లకు అధికారులు దాసోహం

Update: 2024-11-12 02:35 GMT

దిశ బ్యూరో,కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్లకు అధికారులు దాసోహం అంటున్నారు. మిల్లర్లు ఇచ్చే నజరానాలకు అలవాటు పడిన అధికారులు ప్రభుత్వాన్ని నయవంచన చేస్తున్నారు. రూ.కోట్ల ప్రభుత్వ సొమ్మును కోట్టేసి డిపాల్టర్‌గా ఉన్న మిల్లులకే ధాన్యం కేటాయిస్తూ అక్రమ దందాకు అవకాశం ఇస్తున్నారు. సంవత్సరాల తరబడి సీఎంఆర్ పెండింగ్ పెట్టి ప్రభుత్వాలనే చీట్ చేస్తున్నా పట్టించుకోకుండా ధాన్యం కేటాయిస్తు దర్జాగా దోచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అడిగే వారు లేకపోవడంతో అందినకాడికి దండుకుని దర్జాగా ప్రభుత్వ ఖజానాకు గండి కోడుతున్నారు.

డిపాల్టర్ మిల్లులకే ధాన్యం...

ప్రభుత్వం రైతుల వద్ద కోనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు మిల్లులకు తరలిస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని మార్కెట్లో అమ్ముకుని కొందరు మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. అయినా ఏళ్ల తరబడి సీఎంఆర్ పెట్టకుండా డిపాల్టర్లుగా నిలిచిన వారిని నిలువరించాల్సిన అధికారులు వారి వద్ద సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోకుండా వారికే ధాన్యాన్ని కేటాయించడం అధికారుల అక్రమ దందాకు అద్దం పడుతోంది. మిల్లుకు ధాన్యం పంపించిన అధికారులు ఆ ధాన్యాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేస్తున్నాడా.. లేదా? ఆ ధాన్యం మిల్లర్ వద్ద భద్రంగా ఉందా? మిల్లింగ్‌లో జాప్యానికి కారణాలు ఏంటి అని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపి తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ అధికారులు మిల్లర్లు ఇచ్చే నజరానాలు తీసుకుని అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైస్ మిల్లుల యజమానులు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని చీట్ చేస్తూ రూ.కోట్లు కొట్టేశారు. అయితే అవి మిల్లర్ల నుంచి రికవరీ చేయాల్సిన అధికారులు మామూళ్లు ముట్టగానే మాయాజాలం చేస్తూ డిపాల్టర్ మిల్లులకు ధాన్యం కెటాయించడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది.

మిల్లుకు రూ. లక్ష చొప్పున నజరానా?

డిపాల్టర్ మిల్లులకు ధాన్యం ఇవ్వకుండా అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు మిల్లర్లు ఇచ్చే నజరానాకు తలొగ్గి నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం కేటాయించి అక్రమాలకు సహకరించేందుకు మిల్లుకు రూ.లక్ష చొప్పున మిల్లర్లు అధికారులకు నజరానా ప్రకటించడంతో తలొగ్గి దర్జాగా వారికే ధాన్యం కేటాయిస్తూ స్వయానా అధికారులే అక్రమాలకు దారులు తెరుస్తున్నారు. అధికారులను మచ్చిక చేసుకునేందుకు పీడీఎస్ కింగ్ పిన్‌గా పేరొందిన డిపాల్టర్ రైస్ మిల్లు యజమాని చక్రం తిప్పి మిల్లుకు రూ.లక్ష చొప్పున వసూలు చేసి అధికారులకు అప్పగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్ల డబ్బులు అధికారులకు ముట్టగానే ఆగమేఘాల మీద రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని డిఫాల్టర్ మిల్లులకు అప్పగించడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దుమారం రేపుతోంది.

నిబంధనల ప్రకారమే కేటాయించాం : అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారమే మిల్లులకు కేటాయిస్తున్నాం. డిపాల్టర్ మిల్లులకు కెటాయించే ప్రసక్తే లేదు. ప్రభుత్వం పంపిణీ ధాన్యాన్ని సమయానికి సీఎంఆర్ పెట్టే మిల్లులను గుర్తించి వారి నుంచి బ్యాంకు షూరిటీ తీసుకుని కేటాయిస్తున్నాం. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదు. అలాంటివి ఏమైనా మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.


Similar News