పరిహారం పరిహాసం.. మిషన్ భగీరథ అధికారుల కమిషన్ దందా..
కరీంనగర్ జిల్లాలో పరిహారం చెల్లింపు పరిహాసంగా మారింది. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులు తమ ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు.
దిశ బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో పరిహారం చెల్లింపు పరిహాసంగా మారింది. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులు తమ ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు. అమలు చేసే క్రమంలో అక్రమాలకు తెరలేపి అందినకాడికి దోచుకుంటున్నారు. పథకం ద్వారా భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం అందాలంటే వారికి ప్రత్యేక పర్సెంటేజ్ ఇవ్వాలంటూ నిబంధనలు పెడుతున్నారు. అడిగినంత ఇచ్చినవారికి ఆగమేఘాల మీద పరిహారం చెల్లిస్తున్నారు. పర్సెంటేజీలు ఇయ్యని వారికి మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నారు. అందుకు ప్రత్యేక ఏజెంట్లను పెట్టుకుని బాధితులతో రాయబారం చేస్తు రాబందుల్లా పీక్కుతింటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అద్బుతమైన ప్రభుత్వ పథకం జిల్లాలో అబాసుపాలవుతుంది.
పర్సంటేజ్ లకే పరిహారం..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని పర్యవేక్షిస్తూ అమలు చేయాల్సిన ఓ డివిజనల్ స్థాయి అధికారి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో అక్రమాలకు తెరలేపాడు. అవార్డు చేసి పరిహారాన్ని అందించాలంటే పర్సేంటేజ్‌లు ఇవ్వాలంటూ నిబంధనలు పెడుతున్నాడు. అడిగినంత ఇచ్చిన వారికి పరిహారం వచ్చేందుకు అవార్డు చేసినా మొత్తాన్ని బాధితులకు అందిస్తుండగా ఇవ్వని వారిని మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పరిహరం అందాలంటే పర్సెంటేజ్ లు ఇవ్వాల్సిందేనంటూ ఏజెంట్లతో రాయబారం చేస్తు రాబందుల్లా పీక్కు తింటున్నారు. అధికారుల తీరుతో బాధితులు అవస్థలు పడుతుండగా అద్భుతమైన పథకం ఆబాసుపాలవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోస్ట్ ఏఈ బోనస్ గా డీఈ..
మిషన్ భగీరథ శాఖలో పెద్దపల్లి ఏఈ పోస్టు నుంచి డిప్యూటేషన్ పై కరీంనగర్ జిల్లాకు బదిలీ పై వచ్చిన ఓ అధికారి ఏఈ పోస్ట్ తో పాటు బోనస్ గా డీఈ పోస్టును తానే నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. బాధితులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం వాటాలు వసూల్ చేస్తు వాస్తవాలకు విరుద్ధంగా అదనపు అమౌంటుకు అవార్డులు చేస్తు అమాయకులను అడ్డుపెట్టుకుని అక్రమసంపాదనకు ఎగబడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అధికారి వ్యవహారం ఉమ్మడి జిల్లాలో హట్ టాఫిక్ గా చర్చల్లోకి ఎక్కింది.
అక్రమానికి 30 శాతం పర్సంటేజ్ ఇవ్వాల్సిందే..
ప్రభుత్వం చేపట్టిన అదనపు టీఎంసీ వరద కాలువ ఓటీ కెనాల్ రామడుగు మరో ఓటి కెనాల్ షా నగర్ హైవే రోడ్డు విస్తరణ చేసేందుకు భూసేకరణకు శ్రీకారం చుట్టి అందుకు ఓ అధికారికి బాధ్యతలు అప్పగించగా సదరు అధికారి ఇదే అదనుగా భావించి అక్రమాలకు తెర లేపాడు. అంచనాలకు మించి అవార్డులు చేస్తూ అందులోనుండి 30 శాతం వసూల్ చేస్తు ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్నాడు. అడిగేవారు లేకపోవడంతో అక్కడ ఆ అధికారికి అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయి కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు సదరు అధికారి ప్రత్యేక ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వ్యవహారం నడిపించడంతో గుట్టుచప్పుడుకాకుండా అక్రమ దందా సాగుతుందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
నాణ్యతకు తిలోదకాలు..
పనులను పర్యవేక్షించాల్సిన అధికారి తనయుడే కాంట్రాక్టర్ కావడం చేత అక్కడ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘించాడు. దీంతో ఇక్కడ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పనుల అంచనాల్లో పరిహారం చెల్లింపుల్లో అడుగడుగునా అక్రమాలకు తెరలేపుతూ రెండు చేతుల్లో ఖజానాను దోచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనుల అంచనాల్లో అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడంతో పాటు పర్సెంటేజ్ లు వసూల్ చేస్తు అంచనాలకు మించి అవార్డులు చేస్తుండటంతో ఆ పర్సెంటేజ్ ఇవ్వలేని బాధితులు పరిహారం అందక అవస్థలు పడుతున్నారు.
పరిహారం అందిన ప్రతి రైతు వద్ద నుండి ముక్కు పిండి 30% వసూలు చేయడం పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బాధితులు అప్పు తెచ్చి తమకు ముట్ట చెప్పిన పరిస్థితి ఎదురయింది. అంటే అధికారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా రామడుగు, గంగాధర చొప్పదండి మండలాల్లో వేలాది మంది రైతులు సదరు అధికారి బారిన పడి పర్సెంటేజ్ ఇచ్చిన వారే అంటే అతిశయోక్తి లేదు. మూడు మండలాల నష్టపరిహారం రైతుల జాబితాను బయటకు తీసి బహిరంగంగా విచారణ చేపడితే ఏ రైతు వద్ద ఎంత వసూలు చేసింది బయటకు వస్తుందని స్థానికంగా రైతులు బాహాటంగానే చర్చించుకోవడం గమనార్హం.