బాబోయ్.. ఏటీఎంలోకి ముసుగు దొంగ..

మినీ ఏటీఎంలోకి ముసుగు దొంగ చొరబడిన సంఘటన మంథనిలో చోటు చేసుకుంది.

Update: 2024-10-19 09:16 GMT

దిశ, మంథని : మినీ ఏటీఎంలోకి ముసుగు దొంగ చొరబడిన సంఘటన మంథనిలో చోటు చేసుకుంది. మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ఉన్న మినీ ఏటీఎంలోకి శుక్రవారం రాత్రి సమయంలో దొంగ చొరబడ్డాడు. ముఖం కనిపించకుండా పూర్తిగా ముసుగు వేసుకొని ఓ చేతిలో సంచి మరో చేతిలో కత్తి పట్టుకొని స్థానికులను బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో మినీ ఏటీఎం నడుపుతున్న ఓ మహిళ కేకలు వేసింది. అది గమనించిన స్థానికులు దొంగను పట్టుకునే లోపే అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రెండు సంవత్సరాల క్రితం గుంజపడుగులో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో దొంగలు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అక్కడే మినీ ఏటీఎంలోకి దొంగ చొరబడి బెదిరించడం చూస్తే దొంగలు ఇదే ప్రాంతాన్ని టార్కెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని స్థానికులు, పలువురు ఆందోళనకు గురవుతున్నారు.

దొంగ ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి..

మంథని మండలం గుంజపడుగు గ్రామంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ కట్టుకొని కత్తితో మినీ ఏటీఎం నడుపుతున్న మహిళ ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించాడు. ఇతనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సీసీ కెమెరాల్లో లభించాయన్నారు. ఇతడిని ఎవరైనా గుర్తుపట్టినట్టయితే మంథని సీఐ 8712656528, మంథని ఎస్సై 8712656529 నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని ఎస్సై డి.రమేష్ తెలిపారు.


Similar News