Kaleshwaram: నేడు కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం బయలుదేరనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం బయలుదేరనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే వారంతా ప్రత్యేక బస్సులో భారీ ర్యాలీగా వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా మొదట LMD రిజర్వాయర్ సందర్శింmr బీఆర్‌ఎస్ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ దగ్గరికి వెళ్లి 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని ఎలా ఉందో చూస్తారు. అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పక్షం ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పర్యటన వివాదానికి దారి తీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి దెబ్బతిన్నదని చేస్తున్న విష ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని కోరుతున్నారు. తాజాగా, 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుని మేడిగడ్డ నిలబడినట్లుగా ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.