కాళేశ్వరం ప్రాజెక్ట్ కొలాప్స్ కావడానికి కారణం ఆయనే: డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాల అంశాలపై

Update: 2024-06-19 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్/డైనమిక్ బ్యూరో: విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరిపించాలని నిండు సభలో బీఆర్ఎస్ పార్టీయే కోరిందని, తీరా విచారణకు ఆదేశిస్తే ఎందుకు భయపడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇవాళ ఆయన గాంధీ‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపు కోసం విచారణ కమిటీని వేయలేదని, అసెంబ్లీ ఆలోచన మేరకు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. విచారణ ప్రక్రియలో తాము ఎక్కడా జోక్యం చేసుకోవడం లేదని, కమిటీ అడిగిన సమాచారం ఇవ్వడానికి బీఆర్ఎస్‌కు అభ్యంతరం ఏంటని అన్నారు.

కమిషన్ చైర్మన్‌ను తప్పుకోమని కోరడం దేనికి, ఎందుకింత ఆందోళన అని నిలదీశారు. మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి తప్పు జరగలేదనుకుంటే వెళ్లి కమిషన్‌ కోరిన వివరాలు అందించవచ్చు కదా అని అన్నారు. ఇంజినీర్లను కాదని అంతా తానేనని కేసీఆర్ కాళేశ్వరం కడితే అది కూలిపోయిందని, మేడిగడ్డలో ఇసుక మేటలను తొలగిస్తేనే ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభమవుతాయని భట్టి తెలిపారు.

మహిళలకు లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు..

అప్పులు చేసి సంపద సృష్టిస్తామని.. ఆ సంపదను సంక్షేమ పథకాల రూపంలో రాష్ట్ర ప్రజలకు పంచుతామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామని, కేంద్రం చేసే కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. రైతు రుణమాఫీ అంశానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. కులగణన చేస్తామని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ప్రకటించారని, ఆ దిశగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

కష్టపడినవారికే పదవులు..

నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్న వేళ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమించిన నాయకుల సమగ్ర సమాచారం అధిష్టానం వద్ద ఉందని భట్టి చెప్పారు. పనిచేసినవారికే పదవులు దక్కుతాయని, త్వరలోనే పదవుల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు.

Tags:    

Similar News