కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వయిరీ స్టార్ట్

కాళేశ్వరం కరప్షన్, మూడు బ్యారేజీల్లోని వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘన తదితరాలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆది గురువారం నుంచి కార్యకలాపాలను మొదలుపెట్టనున్నది.

Update: 2024-04-25 04:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం కరప్షన్, మూడు బ్యారేజీల్లోని వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘన తదితరాలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆది గురువారం నుంచి కార్యకలాపాలను మొదలుపెట్టనున్నది. బీఆర్‌కేఆర్ భవన్‌లో ప్రత్యేకంగా ఆఫీస్ నెలకొల్పడంతో జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం చేరుకున్నారు. ఇరిగేషన్ డిపార్టుమెంట్ అధికారులు ఆయనకు స్వాగతం పలికి అవసరమైన వివరాలను అందించారు. ఫస్ట్ మీటింగ్‌ను గురువారం లాంఛనంగా ఇరిగేషన్ ఆఫీసర్లతో నిర్వహించనున్నారు. అవసరాన్నిబట్టి ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి అక్కడికి వెళ్ళనున్నారు. ఇప్పటికే సాగునీటిపారుదల శాఖ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు వెళ్ళాయి. తగిన ఏర్పాట్లపై వారు దృష్టి పెట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడం మొదలు డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం, సాయిల్ టెస్ట్, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులు.. ఇలాంటి అనేక అంశాలపై డాక్యుమెంట్లను ఇరిగేషన్ డిపార్టుమెంటు అందించనున్నది. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ, స్టేట్ విజిలెన్స్ కమిషన్ ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ప్రాథమిక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేలా హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ రిటైర్డ్ జడ్జితో విచారణకు సుముఖత వ్యక్తం చేయడంతో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటైంది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్‌పై డ్యామ్ సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను కమిషన్ స్టడీ చేయనున్నది.

ఈ కమిషన్ తన ఫైనల్ రిపోర్టును జూన్ 30వ తేదీలోగా ప్రభుత్వానికి సమర్పించాలని రిక్వెస్టు చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 25 నుంచి యాక్టివిటీస్‌ను ప్రారంభించనున్నది. బీఆర్‌కేఆర్ ఆఫీస్‌లో ప్రత్యేకంగా ఆఫీస్‌ను నెలకొల్పినందువల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆఫీసర్లు, ఇంజనీర్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో వివిధ బాధ్యతల్లో ఉండి ఇప్పుడు రిటైర్ అయిన అధికారులు, ఇంజనీర్లను కూడా ఈ కమిషన్ విచారించనున్నది. వారికి వేర్వేరుగా సమన్లు పంపి విచారణకు రావాల్సిందిగా కోరే అవకాశమున్నది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన జాప్యం, అవినీతి ఆరోపణలు, చత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ ఇప్పటికే పని ప్రారంభించింది. ఇప్పుడు కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ కూడా ఎంక్వయిరీని ప్రారంభిస్తున్నది.


Similar News