పార్లమెంట్‌లో ‘జై పాలస్తీనా’ స్లోగన్.. అసదుద్దీన్‌పై అనర్హత వేటు తప్పదా..?

ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ‘జై పాలస్తీనా’ నినాదాలు చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-06-26 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ‘జై పాలస్తీనా’ నినాదాలు చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎంపీగా ఓవైసీపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు అందాయి. బీజేపీ ఐటీ సెల్ ఇన్ ఛార్జ్ అమిత్ మాలవ్యా రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అసదుద్దీన్‌పై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరారు. వేరే దేశానికి విధేయత చూపినందున ఓవైసీని అనర్హుడిగా ప్రకటించవచ్చని తెలిపారు. ఇక వివాదంపై స్పందించిన అసదుద్దీన్ తాను చేసిన నినాదాన్ని సమర్థించుకున్నారు. ఇలా అనడంలో తప్పులేదన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇలా నినాదాలు చేయొద్దనే నిబంధనలు లేవని తెలిపారు. పాలస్తీనా గురించి గాంధీ ఏమన్నారో చదవాలని సూచించారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాజా వివాదంపై స్పందిస్తూ.. ఫిర్యాదులు అందాయని నిబంధనలు ఏం చెబుతున్నాయో పరిశీలిస్తామన్నారు. అయితే కొంత మంది లాయర్లు సైతం అసదుద్దీన్ ‘జై పాలస్తీనా’ అని ప్రమాణ స్వీకారం అనంతరం నినాదాలు చేయడంపై ఫిర్యాదు చేశారు. 


Similar News