సీపీఎస్‌ని తిరస్కరించి.. పాత పెన్షన్ స్కీంని పునరుద్ధరించండి: జేఏసీ అధ్యక్షుడు లచ్చిరెడ్డి

సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏకీకృత పెన్షన్‌ను తిరస్కరించాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది.

Update: 2024-08-31 10:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏకీకృత పెన్షన్‌ను తిరస్కరించాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం ఆయనకు టీజేఏసీ బృందం వినతిపత్రం సమర్పించింది. ఆ తర్వాత మీడియాతో జేఏసీ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి చందా లేకుండానే పదవీ విరమణ తర్వాత సర్వీస్‌ని బట్టి పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఉండేదన్నారు. ఉద్యోగంలో ఉండి చనిపోయినా లేదా పదవీ విరమణ తర్వాత చనిపోయినా కూడా ఫ్యామిలీ పెన్షన్ అవకాశం ఉంటుంది. 70 సంవత్సరాల తర్వాత వచ్చే అదనపు పెన్షన్, ఉద్యోగం ఉన్నప్పుడు పదవీ విరమణ తర్వాత కూడా హెల్త్ కార్డు సదుపాయం, వేతన సవరణ, కరువు భత్యం అవకాశం ఉంటుందన్నారు.

ఉద్యోగంలో మరణించిన, తొందరగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా కనీస పెన్షన్ 9600 ఉంది. అలాగే కారుణ్య నియామకం అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా 2004 జనవరి ఒకటి తర్వాత ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 2004 సెప్టెంబర్ జనవరి ఒకటి తర్వాత ఉద్యోగంలో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ పద్ధతి శాపమైందన్నారు. దీని ద్వారా నో పెన్షన్ గా ఉందన్నారు. దీనిని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నారన్నారు. పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ కన్న తక్కువ. అంతే కాకుండా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ లేదు, కనీస పెన్షన్ లేదు, ఆరోగ్య పథకాలు కూడా లేవు, పదవీ విరమణ తర్వాత ప్రభుత్వానికి ఉద్యోగికి సంబంధం లేకుండా షేర్ మార్కెట్ కు ఉద్యోగి పెన్షన్ కి ముడి పెట్టారన్నారు.

కమ్యూటేషన్, వేతన సవరణ, కరువు భత్యం, 70 సంవత్సరాల తర్వాత అదనపు పెన్షన్ వంటివి లేవన్నారు. సీపీఎస్ రద్దుకు పోరాటం చేయడంతో గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, కారుణ్య నియామకం మాత్రమే అవకాశం కల్పించారు. కానీ షేర్ మార్కెట్ మీద ఆధారపడి పెన్షన్ ఇవ్వడమన్నది అన్యాయమన్నారు. ఏకీకృత పెన్షన్ స్కీమ్ తో ఉద్యోగి చందా పెంచలేదని, కానీ ప్రభుత్వ చందా 14 నుంచి 18.5 వరకు పెంచారు. ఇందులో కూడా ఉద్యోగి చందా తీసుకొని ఇచ్చే పెన్షన్ కూడా మార్కెట్ మీద ఆధారపడి ఇచ్చే పెన్షన్. దీనిలో కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయితేనే 10000 పెన్షన్ ఉంటుంది. 25 సంవత్సరాల సర్వీసు పూర్తి అయితే 50% పెన్షన్ ఇస్తారన్నారు. దానికి కూడా పూర్తి స్థాయి మార్గదర్శకాలు లేవు. పాత పెన్షన్ స్కీమ్ లో ఎస్సీ, ఎస్టీ బీసీ వికలాంగ ఉద్యోగులు ల ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఉండి, ఉద్యోగులు ప్రయోజనాలు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. అదే ఎన్ పీఎస్, యూపీఎస్ రెండూ ఎస్సీ, ఎస్టీ బీసీ వికలాంగ ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బ తీస్తాయన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, జేఏసీ నాయకులు దర్శన్ గౌడ్, జి.నిర్మల, కత్తి జనార్ధన్, గోపాల్, శశిధర్ రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు.


Similar News