తెలంగాణలో కులగణనకు కసరత్తు మొదలెట్టిన కాంగ్రెస్ సర్కార్

కులగణనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కుల సర్వే చేయడానికి

Update: 2024-06-10 17:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కులగణనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కుల సర్వే చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో నిర్దిష్టంగా కుల సర్వే చేపట్టాలని, పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని బీసీ కమిషన్‌ను కోరింది. దీంతో కులసర్వేకు విధివిధానాల ఖరారు, ప్రశ్నావళి రూపకల్పన, అవలంభించాల్సిన పద్దతులపై బీసీ కమిషన్ చర్యలు మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులతో పీపుల్స్ కమిటీ భేటీ అయింది. రాష్ట్రంలో త్వరలో చేపట్టబోచే సామాజిక, ఆర్థిక కుల సర్వేకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. మౌలిక అభిప్రాయాలను, లిఖిత పూర్వక ప్రతిపాదనలు పరిశీలించి చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని పీపుల్స్ కమిటీ కోరింది. పలు సలహాలు సూచనలతో పాటు లిఖిత పూర్వకంగా పలు అధ్యాయన పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కులసర్వే చేపట్టారన్నారు. సర్వేల్లో ఉత్పన్నమైన న్యాయపరమైన సమస్యలు, ప్రజాస్పందన, సాంకేతికంగా పలు అంశాలు, సాప్ట్ వేర్ రూపకల్పన అంశాలను వివరించారు. కులసర్వే ఆక్షన్ ప్లాన్ తయారీలో భాగంగా త్వరలో రాష్ట్రంలో అన్ని వర్గాల, ప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాలను, కులసంఘాలను ఆహ్వానిస్తామన్నారు. వారంలోపే తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని నిర్మాణాత్మకంగా, హేతుబద్ధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. బీసీ కమిషన్ దేశవ్యాప్తంగా సేకరించిన అధ్యాయన వివరాలను పత్రాల రూపంలో పీపుల్స్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ భేటీలో బీసీ కమిషన్ సభ్యులు కె.కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, సభ్య కార్యదర్శి బి.బాలమాయదేవి, పీపుల్స్ కమిటీ సభ్యులు జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్లు మురళి మనోహర్, పీఎల్ విశ్వేశ్వర్ రావు, ఐ.తిరుమలి, సంహాద్రి, పద్మబాషా, నరేంద్రబాబు, డాక్టర్ పృద్వీరాజ్, దేవల్ల సమ్మయ్య, సతీష్ కొట్టే పాల్గొన్నారు.


Similar News