మోదీ, ఓవైసీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌కు డ్యామేజ్.. కాంగ్రెస్ వైపు పాజిటివ్
వరుసగా రెండు టర్ములు బీఆర్ఎస్‌కు మద్దతిచ్చిన ముస్లిం మైనారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: వరుసగా రెండు టర్ములు బీఆర్ఎస్‌కు మద్దతిచ్చిన ముస్లిం మైనారిటీవరుసగా రెండు టర్ములు బీఆర్ఎస్‌కు మద్దతిచ్చిన ముస్లిం మైనారిటీ ఓటర్లు.. ఈసారి ఎటువైపు ఉంటారనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నది. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ-టీమ్‌గా ఉన్నదని, బీఆర్ఎస్‌తో స్నేహ సంబంధాలు ఉండడంతో మజ్లిస్ పార్టీకి కూడా ఆ మచ్చ అంటుకున్నదనే అభిప్రాయం మెజార్టీ ముస్లింలలో వినిపిస్తున్నది. సీఎం హోదాలో కేసీఆర్ తన దగ్గరకు వచ్చి పార్టీ ప్రయోజనాల గురించి మాట్లాడారని, ఎన్డీఏ కూటమిలో చేరడంపై చర్చించారని స్వయంగా ప్రధాని మోడీ చెప్పడంతో బీ-టీమ్ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. దీనికి తోడు మజ్లిస్ అభ్యర్థులు నిలబడని చోట బీఆర్ఎస్‌కు మద్దతు పలకాలంటూ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల పిలుపు ఇవ్వడం ప్రతికూల ఫలితాలకు దారితీసింది. ఇప్పటికే కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్‌ను ఢీకొట్టడానికి నానా అవస్థలు పడుతున్న బీఆర్ఎస్.. తాజాగా ఒవైసీ వ్యాఖ్యలతో మరింత చిక్కుల్లో పడింది. బీజేపీకి, బీఆర్ఎస్‌కు మధ్య రాజకీయ వైరం లేదని, ఈ రెండూ ఫ్రెండ్లీ రిలేషన్స్‌లో ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఒవైసీ కామెంట్స్ చేయడంతో.. మజ్లిస్ పార్టీ కూడా ఆ రెండు పార్టీలతో ఉన్నదనే ముద్ర పడడానికి కారణమైంది. రంజాన్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడం, తోఫా పేరుతో కానుకలు ఇవ్వడం, ముస్లిం మైనారిటీలకు గురుకుల విద్యా సంస్థలను నెలకొల్పడం, షాదీ ముబారక్ స్కీమ్ అమలు.. వీటన్నింటితో బీఆర్ఎస్ పట్ల సానుభూతి, పాజిటివ్ దృక్పథం ఉన్నప్పటికీ బీ-టీమ్ ముద్రతో వారి ఆలోచనల్లో మార్పు చోటుచేసుకున్నది.
భిన్నంగా ఓటర్ల తీరు?
బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే సంప్రదాయం ఉన్న ముస్లిం మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్‌ను సెక్యులర్ పార్టీగా గుర్తిస్తున్నప్పటికీ బీ-టీమ్ ముద్రతో పాటు ప్రధాని చేసిన కామెంట్లతో ఈసారి భిన్నమైన తీరులో వ్యవహరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు పార్టీల్లో దేనికి ఓటు వేసినా అది బీజేపీకి అనుకూలంగా మారుతుందనే స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. దీర్ఘకాలం నుంచి మజ్లిస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్న ఓటర్ల ఆలోచనల్లో మార్పు లేకపోయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు పోటీచేయని చోట మాత్రం బీఆర్ఎస్‌కు ఓటు వేయరాదనే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు పలు జిల్లాల్లోని ఓటర్లు ఓపెన్‌గానే వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, మజ్లిస్ ఫ్రెండ్లీ పార్టీలుగా ఉన్నాయని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగానే చెబుతున్నారు. బీఆర్ఎస్ పట్ల ఇప్పటివరకూ ఉన్న అభిప్రాయం మేరకు ముస్లిం ఓటర్లు ఆ పార్టీని ఆదరించారు. నిజానికి రాష్ట్రంలోని దాదాపు 40 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఒక రకంగా వారు పార్టీ గెలుపోటములకు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా శివారు సెగ్మెంట్లలో డిపెండబుల్ ఓటర్లుగా ఉన్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ముక్కోణపు పోటీ ఉన్న నేపథ్యంలో ముస్లిం ఓట్లు కీలకం కానున్నాయి.
కర్ణాటక ఫార్ములా రిపీట్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత ముస్లిం ఓటర్లు జేడీఎస్‌వైపు మొగ్గు చూపినా.. ఆ తర్వాత ఆ పార్టీకి బీజేపీతో ఉన్న ప్రెండ్లీ రిలేషన్స్‌తో ఓటర్లు మనసు మార్చుకుని కాంగ్రెస్ వైపు మళ్లారు. ఈ కారణంగానే అంచనాలకు మించి కాంగ్రెస్‌కు ఓట్ల శాతం, సీట్ల సంఖ్య పెరిగింది. తెలంగాణలో సైతం ఇదే ఫార్ములా రిపీట్ కానున్నదనే వాతావరణం నెలకొన్నది. కర్ణాటకలోని బీజేపీ హిజబ్ వివాదాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించినా, యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ముస్లింలకు అండగా నిలిచినా, బీజేపీ లేవనెత్తిన లవ్ జిహాద్ ఘటనలను తూర్పారబట్టినా తాజా రాజకీయ పరిణామాల్లో గులాబీ పార్టీకి ముస్లిం మైనారిటీల ఓట్లు కలిసొచ్చేలా లేవు. బీజేపీతో ఉన్న బంధమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.