vyjayanthi movies: వరద సాయంలోనూ తెలంగాణపై టాలీవుడ్ లో ఇదేం వివక్ష?.. నెటిజన్ల ఆగ్రహం
కల్కీ మూవీ మేకర్స్ వరద సాయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు జనజీవనాన్ని కకావికలం చేస్తున్నాయి. సర్వం కోల్పోయి గుక్కెడు మంచి నీళ్లు, ఆహారం కోసం దీనంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరాశ్రయులకు సహాయం అందించేందుకు అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే ఈ వరద సాయం విషయంలో మరోసారి టాలీవుడ్ లో ప్రాంతీయ వివక్ష చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వరద సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. రేపటి కోసం అంటూ క్యాప్షన్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేసింది. అయితే వైజయంతీ మూవీస్ చేసిన ఈ ప్రకటన తెలంగాణ ప్రజలకు కోపం తెప్పిస్తోంది. రెండు రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉందని, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దఎత్తున విధ్వంసం జరిగితే కేవలం ఏపీ ప్రభుత్వానికి మాత్రమే విరాళం ప్రకటించి తెలంగాణ పట్ల వివక్ష చూపడం ఏంటని పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు. ఏపీ కష్టాలు కనిపించే మీకు తెలంగాణ ప్రజల కష్టాలు కనిపించవా? టాలీవుడ్ పెద్దలు గతంలోనూ తెలంగాణ పట్ల ఇదే తరహా వివక్ష చూపించే వారని ఇదే తంతు కంటిన్యూ అవుతున్నదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కల్కీ సినిమా ద్వారా కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించిన వైజయంతీ మూవీస్ సంస్థ ప్రముఖులు తెలంగాణలో ఉంటూ తెలంగాణలో సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రజల నుంచి లాభాలు పొందుతూ విరాళాల విషయంలో వివక్ష చూపడం సరికాదని మండిపడుతున్నారు.
రెండు రాష్ట్రాలకు జూఎన్టీఆర్ విరాళం:
మరోవైపు ప్రకృతి వైపరీత్యం పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. జూ.ఎన్టీఆర్ వరద కష్టాలపై స్పందించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. 'రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరలో ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. హీరో విశ్వక్ సేన్ సైతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.