తిరుగులేని పొంగులేటి! బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటికి మాస్ లీడర్‌గా పేరుంది.

Update: 2023-05-04 02:04 GMT

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటికి మాస్ లీడర్‌గా పేరుంది. ఎలాంటి పదవి లేకపోయినా ఆయన నిత్యం జనాల్లో ఉంటూ తన చరిష్మాని పెంచుకుంటున్నారు. కానీ ప్రస్తుతం శ్రీనివాస రెడ్డి పొలిటికల్ కెరీర్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి దూరమైన ఆయనను కాంగ్రెస్, బీజేపీ పెద్దలు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా.. పొంగులేటి మాత్రం ఆచితూచి అడుగేస్తున్నారు. మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి అసలు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉండగా.. కాంగ్రెస్‌కు భట్టి తప్ప మరో దిక్కు లేదు..

ఇక అధికార పార్టీ ట్రాక్ రికార్డ్ కూడా ఇక్కడ అంతంతే.. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పొంగులేటి హవా కొనసాగక తప్పదనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలకు ధీటుగా ఆయన తన టీంను తయారుచేసుకున్నారు. ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయన వర్గంలో చాలా మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. త్వరలోనే ఇంకొందరు ముఖ్యనేతలు సైతం ఆయన టీంలో చేరనున్నట్టు టాక్.

దిశ బ్యూరో, ఖమ్మం : పొంగులేటి రాజకీయాల్లోకి వచ్చిన అతితక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా.. మరో మూడు స్థానాల్లో తన అభ్యర్థులనూ గెలిపించుకున్నారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరిన ఆయనకు.. 2018 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి పార్టీకి ఆయనకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలోని నేతల ఆధిపత్యంతో పార్టీకి కొంతకాలంగా ఆయన దూరంగా ఉన్నారు.

ఇటీవల పార్టీ నుంచి ఆయన బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించడంతో.. ఏ పార్టీలో చేరకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆయన జనం మధ్యే ఉంటూ మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం పొంగులేటి హవా కొనసాగుతున్నది.. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తరఫు నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఆయన సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పొంగులేటి తన యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నారు.

బీజేపీకి అభ్యర్థులు కరువు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఇప్పటికీ సరైన అభ్యర్థులు లేరు. అధికార పార్టీ నేతల మాటలకు కౌంటర్ ఇచ్చే నేతలు కూడా కనిపించరు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు కూడా లేదు. దిశానిర్దేశం చేసే జిల్లా నాయకత్వం లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటి పార్టీలో చేరితే పది నియోజకవర్గాల్లోనూ బలపడవచ్చని బీజేపీ భావిస్తున్నది. అందుకే పొంగులేటిని పార్టీలోకి చేర్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పొంగులేటి చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో భట్టి ఒక్కరే..

2018 ఎన్నికల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.. అనంతర పరిణామాల్లో నలుగురు అధికార పార్టీలో చేరిపోగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు. ప్రస్తుతం భట్టి తప్ప ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు బలమైన నాయకుడు లేడనే చెప్పాలి. అంతేకాకుండా భట్టి, రేవంత్ మధ్య నడుస్తున్న అంతర్గత పోరు ప్రభావం ఉమ్మడి ఖమ్మంపై పడుతున్నది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ చీలిపోయింది.. వీరికి తోడు అప్పుడప్పుడూ వచ్చే రేణుకా చౌదరి ఆధిపత్య పోరు సైతం జిల్లా కాంగ్రెస్ ను సతమతం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటిపై కాంగ్రెస్ కూడా నజర్ వేసింది. పొంగులేటి చేరితే పార్టీకి తిరుగుండదని భావిస్తున్నది.

అధికార పార్టీలో వర్గపోరు

ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ వర్గపోరుతో సతమతమవుతున్నది. శ్రీనివాసరెడ్డిని వదులుకుంటే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఖతం అంటూ పీకే రిపోర్ట్‌లో వెల్లడైనట్టు ఓ నివేదిక సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. అయితే ఆ నివేదిక వాస్తవమో కాదో తెలియదు కానీ, పార్టీ పరిస్థితి మాత్రం అలాగే ఉందని చర్చ జరుగుతున్నది. 2018 తర్వాత వేరే పార్టీల నుంచి గెలిచిన నేతలు కారెక్కడంతో అప్పుడు ఓడిపోయి పార్టీలో ఉన్నవారు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో పార్టీ రెండు, మూడు వర్గాలుగా చీలడంతో వర్గపోరు నడుస్తూనే ఉంది. ఈ పరిస్థితులన్నీ వచ్చే ఎన్నికల నాటికి పొంగులేటికి కలిసి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

పొంగులేటి తరపున పోటీ చేసేందుకు..

ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ పరిస్థితి కూడా మెరుగ్గా లేకపోవడంతో పొంగులేటి డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికే శ్రీనివాస రెడ్డి అన్ని నియోజవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ప్రజా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల తమ వర్గం తరఫున పోటీచేసే అభ్యర్థులను సైతం ప్రకటించి దీవించమని ప్రజలను వేడుకున్నారు. పొంగులేటి వర్గం తరఫున పోటీ చేసేందుకు మిగతా పార్టీల్లోని అసంతృప్తులు సైతం ముందుకు వస్తున్నట్లు సమాచారం. అయితే కొంతమంది ముఖ్యనాయకులు ఇప్పుడే బయటకు రాక తమ అత్యంత సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పొంగులేటి తరఫున పోటీ చేసేందుకు ఇప్పటికే ఆశావహుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిసింది.

అన్ని సెగ్మెంట్లలోనూ పోటాపోటీ..

పొంగులేటి అన్ని నియోజవర్గాల్లో ఎవరి బలమెంతో అనే విషయమై నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. అన్నిచోట్లా పోటాపోటీ అభ్యర్థులను నిలిపేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే కొన్నిచోట్ల కన్ఫామ్ కాగా.. కొన్నిచోట్ల వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. పదినియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తనపైనే ఉండడంతో అందుకు తగినట్లుగానే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండేలా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా.. రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అనుచరగణం పొంగులేటి వెంట అడుగులు వేస్తారని.. బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులు సైతం ఆయనకు మద్దతుగా బయటకు వచ్చే అవకాశముందని సన్నిహితులు చెబుతున్నారు.

Read more:

కవిత ఫ్యామిలీపై ఈడీ స్పెషల్ ఫోకస్! ఆ సంస్థల్లో సోదాలు? 

షర్మిలకు ఎదురుగాలి స్టార్ట్.. పాలేరులో పోటీ కూడా కష్టమేనా..?

షర్మిల పార్టీకి భవిష్యత్తు ఉందా!

Tags:    

Similar News