సీఎం సంతకం లేకుండానే సాంక్షన్.. బీఆర్ఎస్ హయాంలో మరో భారీ స్కామ్!
పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్’ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్’ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్‌లో ఎంపికైన ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల స్కాలర్ షిప్ ఇస్తారు. ఈ స్కీమ్ ద్వారా ప్రధానంగా పేద విద్యార్థులకు లబ్ధి జరగాల్సి ఉంది. కానీ.. గత ప్రభుత్వం హయాంలో స్కీమ్‌ను ఆసరాగా చేసుకొని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తున్నది. అనర్హులకు చెక్కులు అందించేందుకు పథక రచన చేసినట్లు సమాచారం. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్ల బంధువులు, ఫాలోవర్స్ పిల్లలకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేశారని తెలిసింది. సీఎం సంతకం లేకున్నా సాంక్షన్ లెటర్లు సైతం జారీ చేశారని టాక్. ఎలాగూ మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఆ నేతలంతా ఈ విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే.. అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో వారి ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి.
రూ.100 కోట్లు కొల్లగొట్టేలా ప్లాన్
ఎన్నికల టైమ్‌లో ఎవరూ పట్టించుకోరనే ధీమా కావచ్చు.. లేదంటే మళ్లీ అధికారంలోకి వస్తామని అతివిశ్వాసం కావచ్చు.. కారణం ఏదైనా బీఆర్ఎస్ రూలింగ్‌లో అనర్హులైన విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిఫ్ సాంక్షన్ చేశారు. సుమారు 500 మంది అనర్హులైన స్టూడెంట్స్‌కు దాదాపు రూ.100 కోట్లను అందించేందుకు ప్లాన్ చేశారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందు బీఆర్ఎస్ సర్కారులో పెద్ద ఎత్తున ఈ స్కాలర్ షిప్‌లను మంజూరు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్ల సిపారసుల లెటర్ల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే.. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. నిరుపేదలైన విద్యార్థులకు అందించాల్సిన ఆర్థిక సాయాన్ని తమ బంధువులు, అనుచరుల పిల్లలకు ఇచ్చేందుకు ప్లాన్ చేశారని చర్చ జరుగుతున్నది.
రిచ్ స్టూడెంట్స్‌కే బినిఫిట్స్
ఈలోపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అసలు గుట్టు బయటపడింది. బీఆర్ఎస్ హయాంలో సాంక్షన్ చేసి, ఎన్నికల కోడ్ రావడంతో చెక్కులు ఇవ్వకుండా సుమారు 700 అప్లికేషన్లు పెండింగ్‌లో పెట్టారు. అయితే.. కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో వాటిలో అర్హులు ఎవరు? నిబంధనల మేరకే సాంక్షన్ చేశారా? లేదా? గుర్తించి రిపోర్టు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి దరఖాస్తునూ క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి పేరెంట్ వివరాలను సేకరించారు. ఆ సమయంలో అసలు నిజాలు బయటపడినట్టు తెలుస్తున్నది. ఎన్నికల టైమ్‌లో సాంక్షన్ చేసిన స్కాలర్ షిప్స్‌లో పొలిటికల్ లీడర్లు, వ్యాపారస్తుల పిల్లలే అధికంగా ఉన్నట్టు గుర్తించారు. తమకు ఉన్న రాజకీయ పలుకుబడితో తమ పిల్లలకు స్కాలర్ షిప్స్ మంజూరు చేయించుకున్నట్టు చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు సాంక్షన్ చేసిన లిస్టులో సుమారు 500 మంది అనర్హులైన స్టూడెంట్స్ ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి, వాటిని రిజెక్ట్ చేసినట్టు తెలిసింది.
ఆధార్ నంబర్‌తో విషయం వెలుగులోకి..
ఆధార్ నంబర్ ఆధారంగా ఒక వ్యక్తికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి? ఎప్పటి నుంచి ఐటీ రిటర్న్ చెల్లిస్తున్నారు? అని తెలుసుకునే సాఫ్ట్‌వేర్ ప్రభుత్వం వద్ద ఉంది. ఓవర్సీస్ స్కాలర్ షిప్ కోసం స్టూడెంట్స్ సమర్పించే అప్లికేషన్‌లో పేరెంట్స్ ఆధార్ నంబర్ కూడా తప్పనిసరి. సాంక్షన్ చేసిన దరఖాస్తుల్లో ఉన్న పేరెంట్స్ ఆధార్ నంబర్‌ను పరిశీలించగా వారికి ఖరీదైన కార్లు, ఆస్తులు ఉన్నట్లుగా డేటా బయటపడినట్టు తెలిసింది. ఏటా ఐటీ చెల్లించే పేరెంట్స్ పిల్లలు కూడా అందులో ఉన్నట్టు టాక్ ఉంది. కొందరు గెజిటెడ్ హోదా ఉన్న ఆఫీసర్లు కూడా ఆ లిస్టులో ఉన్నట్టు తెలిసింది.
సీఎం సంతకం లేకుండానే సాంక్షన్
ఓవర్సీస్ స్కీమ్ సాంక్షన్ అథారిటీ కేవలం సీఎంకు మాత్రమే ఉంటుంది. ప్రతి అప్లికేషన్‌పై సీఎం సంతకం తప్పనిసరి. కానీ.. చాలా దరఖాస్తులపై సీఎం సంతకం లేకుండానే సాంక్షన్ చేశారని తెలిసింది. అప్పటి సీఎం ఆదేశాల మేరకే అధికారులు సాంక్షన్ చేశారా? లేకపోతే మళ్లీ అధికారంలోకి వస్తాం కదా, వచ్చాక సీఎం సంతకం తీసుకుందాంలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సాంక్షన్ చేశారా? అనేది తెలియకుండా ఉంది. ఎవరి ఆదేశాల మేరకు స్కాలర్ షిప్ మంజూరు చేశారని ఆ టైమ్‌లో ఆ శాఖల్లో పనిచేసిన అఫీసర్లను విచారించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది.