TG Assembly Session: ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చా: బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్

9 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన జీవోలతో సహా చెప్పేందుకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు.

Update: 2024-07-25 06:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 9 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన జీవోలతో సహా చెప్పేందుకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గత కేసీఆర్ హయంలో వారికి 12 మంది ఎంపీలు ఉన్నారని, అప్పుడు ఎన్ని కేంద్ర నిధులు తెలంగాణకి ఇచ్చారో మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. సభ్యులు ఒక్కరిపై విమర్శలు చేసుకొని తర్వాత మిత్రులుగా చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు అంత మిత్రులు అయితే ప్రజలే శత్రువులా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేతకాక రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించలేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని నిలదీశారు.

తాను జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశానని చెప్పుకొచ్చారు. సభలో ఎలా ఉండాలో తనకు తెలుసన్నారు. అప్పట్లో అసెంబ్లీ బయటి నుంచి వెళ్ళేటప్పుడు.. ఎప్పుడు అసెంబ్లీకి వెళ్తమా అనుకునేవాడిని అని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే వారు ప్రజలకు బాగు చేస్తారు అనుకునే వాడిని అని చెప్పుకొచ్చారు. జీతాలు తీసుకుంటున్న ఎంఎల్ఏలు అసెంబ్లీకి రారని, ఇద్దరు నాయకులు మాట్లాడితే మిగతా 60 మంది భజన చేస్తారని విమర్శించారు. అసెంబ్లీ లో ప్రజలు గురించి మాట్లాడే నేతలే లేరన్నారు.

రాజకీయ నాయకుడికి కమిట్మెంట్ ఉండాలని, అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడాలని మినిమమ్ కామన్ సెన్స్ ఏ నేతకి లేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని తనకు బాధేస్తోందన్నారు. ప్రజల ఘోష నేతలకు వినపడటం లేదన్నారు. ఎమ్మెల్యేలు బాధ్యతారహితంగా ఉంటున్నారని, తానేం సత్యహరించంద్రుడిని కాదని, అంత అలానే ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు.

Tags:    

Similar News