శ్రీ నారాయణతో ఇంటర్ బోర్డు ములాఖత్..! కళాశాలను మూసివేసేందుకు వెనుకడుగు
లంగర్‌హౌజ్‌లోని శ్రీనారాయణ కాలేజీపై ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దిశ, హైదరాబాద్ బ్యూరో: లంగర్‌హౌజ్‌లోని శ్రీనారాయణ కాలేజీపై ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాలేజీ యాజమాన్యంతో ఇంటర్ బోర్డు అధికారులు ములాఖత్ అయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేని కళాశాలను సీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు మీనమేషాలు లెక్కించడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అనుమతి లేకుండానే మూడేళ్లుగా..
లంగర్ హౌస్‌లోని శ్రీనారాయణ కళాశాలను సంబంధిత యాజమాన్యం మూడేళ్లుగా అనుమతు లేకుండానే నిర్వహించడం వెనుక ఇంటర్ బోర్డు అధికారుల హస్తం ఉందని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇంటర్ బోర్డు అధికారులకు ఈ విషయం తెలియకపోతే వారి పనితీరుపైన కూడా అనుమానాలు వస్తున్నాయి. శ్రీనారాయణ కళాశాల యాజమాన్యం మరో కాలేజీ మేనేజ్‌మెంట్‌తో కలిసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. శ్రీనారాయణ కళాశాల యాజమాన్యం కాలేజీకి అనుమతి లేకపోయినా అడ్మిషన్లు విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. మరో కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కై వారికి డబ్బులు ఇచ్చి ఆ కళాశాల పేరు మీద పరీక్షలు రాయిస్తున్నారు. వ్యవహారం అంతా ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసిన కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేయడంలో ఆతర్యం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించినా..
ఇంటర్ బోర్డు అధికారులు సుమారు నెల రోజుల క్రితం తనిఖీలు నిర్వహించి ఇంటర్ బోర్డుకు నివేదిక సమర్పించిన కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులకు శ్రీనారాయణ కాలేజీ యాజమాన్యానికి మధ్య వ్యవహారం జరుగుతుందని అనుమానిస్తున్నారు. తక్షణమే కళాశాలను మూసివేయకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. శ్రీనారాయణ కళాశాలతో ములాఖత్ అయి చర్యలు తీసుకొని ఇంటర్ బోర్డు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నివేదిక అందించాం.. మూసివేస్తాం: వడ్డెన్న, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
లంగర్ హౌస్‌లోని శ్రీనారాయణ కాలేజీకి అనుమతులు లేదని మా పరిశీలనలో తేలింది. కాలేజీని సిజ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. త్వరలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. శ్రీనారాయణ కాలేజీ యాజమాన్యం అధికారులను కూడా తప్పుదోవపట్టించే విధంగా వర్ణించింది. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదు.