నేడు చేవెళ్లలో ఖర్గే సభ..

కాంగ్రెస్ పార్టీ కీలక సభ నేడు చేవెళ్లలో జరగనున్నది.

Update: 2023-08-26 05:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కీలక సభ నేడు చేవెళ్లలో జరగనున్నది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభకు సుమారు 10 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ మీటింగ్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చీఫ్ ​గెస్టుగా హాజరుకానున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. ఏఐసీసీ చీఫ్ హోదాలో ఫస్ట్ టైమ్ తెలంగాణలో ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల వాతావరణంలోకి తీసుకువెళ్లేందుకు ఈ సభను ఉపయోగించుకోనున్నారు. ఇక మల్లిఖార్జున ఖర్గే ప్రకటించబోయే డిక్లరేషన్‌పై ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

క్రియాశీలకంగా అంశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు ఇప్పటికే లీకులు ఇస్తున్నప్పటికీ ఖర్గే ఏం ప్రకటించబోతున్నారో? అని కాంగ్రెస్ కేడర్ కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. ఈ సభతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మైలేజ్ పెంచేలా స్పీచ్‌​లను ప్రిపేర్ చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పవర్‌లోకి తెచ్చి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలనే నినాదంతో పాటు.. ఇప్పటికే ప్రకటించిన రైతు, యూత్ డిక్లరేషన్‌లోని కీలక అంశాలపైనా వివరించనున్నట్లు సమాచారం. సెంటిమెంట్‌తో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. దీంతో మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను పరోక్షంగా ప్రస్తావించనునున్నారు. బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ హామీలను స్పష్టంగా ప్రజలకు చెప్పనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News