Telangana Rains : గతంలో కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ మునిగేది: ఎక్స్‌లో భట్టి విక్రమార్క ఆసక్తికర పోస్ట్
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు రాజకీయంగా సోషల్ మీడియాలో బతికేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్య ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం హై అలర్ట్‌గా ఉన్నందునే స్వల్ప ప్రాణ నష్టం కూడా జరగలేదన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోయేదని, జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రాను సిద్ధం చేశామన్నారు. నిరాశ్రయులకు తక్షణమే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని, వరద ఉధృతి తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి ఆదుకుంటామన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. విపత్కర సమయంలో అర్ధరాత్రి కూడా పనిచేస్తూ విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న విద్యుత్ సిబ్బందికి, సేవలు చేస్తున్న పోలీస్ శాఖకు నా అభినందనలు తెలిపారు.