తెలంగాణ ఏర్పడేనాటికి అప్పు రూ.75 వేల కోట్లు.. ఇప్పుడు ఎంతైందో తెలుసా?

సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో గొప్పగా ప్రకటించుకున్నారు. ఇందుకు ఆసరా పింఛన్ల మొదలు రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత గొర్రెల, చేపపిల్లల పంపిణీ వరకు అనే స్కీమ్‌లను ఉదహరిస్తున్నారు.

Update: 2023-06-02 02:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో గొప్పగా ప్రకటించుకున్నారు. ఇందుకు ఆసరా పింఛన్ల మొదలు రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత గొర్రెల, చేపపిల్లల పంపిణీ వరకు అనే స్కీమ్‌లను ఉదహరిస్తున్నారు. మొత్తం బడ్జెట్‌లో సింహభాగం వెల్ఫేర్ స్కీమ్‌లకే కేటాయించాల్సి వస్తున్నది. ఇందుకోసం సొంత ఆదాయ వనరుల కంటే అప్పులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడుతున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి బడ్జెటేతర రుణాలతో పాటు ప్రభుత్వ అప్పు రూ.75 వేల కోట్లు మాత్రమే. అప్పటికీ రాష్ట్రం మిగులు బడ్జెట్‌లోనే ఉన్నది. తొమ్మిదేళ్ల ప్రయాణం తర్వాత మొత్తం అప్పులు నాలుగున్నర లక్షల కోట్లకు చేరుకున్నది.

సంక్షేమ భారం..

ఇబ్బడిముబ్బడిగా ప్రకటించిన సంక్షేమ పథకాలు సర్కారుకు భారంగా మారాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పింఛన్ల పెంపుతో ఖజానాలో చిల్లిగవ్వ లేని పరిస్థితి తయారైంది. ఫలితంగా దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వ్యవసాయ యాంత్రికీకరణ, ఇన్‌పుట్ సబ్సిటీ, పంటల బీమా, పంట నష్టానికి సాయం, బీసీ కులాలకు ఆర్థిక సాయం.. ఇలాంటి పదుల సంఖ్యలో పథకాలు కొన్ని అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇక విప్లవాత్మక పథకంగా చెప్పుకుంటున్న దళితబంధుకు గతేడాది రూ. 17,700 కోట్లను కేటాయించినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేకపోయింది. ఇలా అనేకానేక హామీలు అమలుకు నోచుకోలేకపోయాయి.

ఆదాయం కోసం తంటాలు

రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు రిజర్వు బ్యాంకు అప్పులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌ల నిధులపై ఆధారపడుతున్నది. సొంత ఆదాయాన్ని పెంచుకోడానికి మద్యం వ్యాపారంపై ఆశలు పెట్టుకున్నది. విద్యుత్ చార్జీలను వేర్వేరు రూపాల్లో పెంచడం, ఆర్టీసీ బస్ చార్జీల పెంపు, భూముల విలువ సవరణ పేరుతో పెంచడం, భూ రిజిస్ట్రేషన్ల ఫీజును ఎక్కువ చేయడం.. ఇవన్నీ ఆదాయ మార్గాలుగా ఎంచుకున్నది.

తొమ్మిదేళ్లలో లక్ష కోట్లు వడ్డీలకే

గడచిన తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు నాలుగున్నర లక్షల కోట్లు దాటింది. ఇందులో ప్రభుత్వం నేరుగా రిజర్వు బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్‌మెంట్ లోన్ పేరుతో తీసుకున్న రుణాలే గతేడాది మార్చి చివరి నాటికి రూ. 3.22 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీనికి తోడు కాళేశ్వరం, మిషన్ భగీరథ, డ్రింకింగ్ వాటర్ డెవలప్‌మెంట్, హౌజింగ్, దక్షిణ డిస్కమ్, జల మండలి, హైదరాబాద్ మెట్రో, షీప్ డెవలప్‌మెంట్, మార్క్ ఫెడ్, ఆర్టీసీ.. ఇలాంటి అనేక కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న అప్పులు రూ. 2.10 లక్షల కోట్లు దాటాయి. వీటిని కూడా కలుపుకుంటే ప్రభుత్వ ‘ఔట్‌స్టాండింగ్ డెట్’ సుమారు రూ. 5.32 లక్షల కోట్లకు చేరుకున్నది. ఈ తొమ్మిదేళ్లలో రుణాల మీద చేసిన వడ్డీ చెల్లింపులే రూ. 1.05 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏటేటా వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం బడ్జెట్‌లో ‘డెట్ సర్వీస్’ పేరుతో కేటాయింపులు పెంచుకోవాల్సి వస్తున్నది. బడ్జెట్‌లో పేర్కొన్న ఆర్బీఐ రుణాలతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పులు పరిమితి దాటిపోతున్నాయని ‘కాగ్’ రెండేండ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్ర రుణ పరిమితి ఎఫ్ఆర్‌బీఎంని మించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐనుంచి తీసుకోవాల్సిన రుణాల్లో 17% మేర కేంద్ర ఆర్థిక శాఖ కోత విధించింది. అందువల్లనే దళితబంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది.

మూడు జిల్లాలదే అగ్రభాగం

రాష్ట్ర తలసరి ఆదాయం ఏటేటా పెరుగుతున్నా అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వాటానే ఎక్కువ. వీటిని తీసేస్తే ఇతర జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థిరత్వంలో పెద్దగా మార్పులు లేవు. పంట పెట్టుబడి సాయం పేరుతో రైతుబంధు రూపంలో ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇస్తున్నా రైతుల అప్పుల భారం తగ్గడంలేదు.. ఆత్మహత్యలూ కంట్రోల్ కాలేదు. రైతుబీమాతో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందుతున్నా నాలుగేళ్ళలోనే సుమారు లక్ష మంది చనిపోయారు.

Also Read: అన్ని విభాగాలకు ‘ఆవిర్భావ’ టాస్క్ టెన్షన్!

Tags:    

Similar News