Munneru River : ఖమ్మం అతలాకుతలం.. ముంచెత్తిన మున్నేరు వాగు

భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది.

Update: 2024-09-01 11:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధం అయ్యాయి. రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర నగర్ కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. మున్నేరు వాగు పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కాలనీలు నీట మునగడంతో ఇళ్లపైకి చేరి సహాయం కోసం వందలాది మంది బాధితులు ఎదురుచూస్తున్నారు. రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఖమ్మం టౌన్ ప్రకాశ్‌నగర్‌లో మున్నేరు వాగు వరదలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని సీఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు.

వరదల్లో కొట్టుకుపోయిన పలువురు

పాలేరు వాగు వరదలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన యాకూబ్, సైదాబీ, షరీఫ్ గల్లంతు అయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు వాగు ఉధృతిని చూడడానికి వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. ఖమ్మం తిరుమలాయపాలెం మండలం రాకాసితండా జలదిగ్బంధం అయింది. ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు సాధ్యపడటం లేదు. బోట్ల సహాయంతో వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ఇవాళ ఉద‌యం కారులో హైదరాబాద్‌కు బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని వరదలో కొట్టుకుపోయారు. మ‌ధ్యాహ్నం అశ్విని మృత‌దేహం ల‌భ్యం కాగా మోతిలాల్ ఆచూకీ దొరకలేదు.

అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాల నిలిపివేత

తెలంగాణ-ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు పొంగిపోర్లుతోంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. చిమిర్యాల వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు భారీగా స్తంభించిపోయాయి.


Similar News