జీవో 111 ఎత్తివేతకు చిక్కులు.. అడ్డంకిగా ప్యారీస్ ఒప్పందం

దిశ, తెలంగాణ బ్యూరో: 84 గ్రామాలకు సరికొత్త పండగొచ్చింది. అవును.. ఇది నిజం. ఎన్నాండ్లుగానో ఎదురుచూస్తోన్న పండుగ. 30 ఏండ్ల నిషేదాజ్ఞల

Update: 2022-04-13 02:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: 84 గ్రామాలకు సరికొత్త పండగొచ్చింది. అవును.. ఇది నిజం. ఎన్నాండ్లుగానో ఎదురుచూస్తోన్న పండుగ. 30 ఏండ్ల నిషేదాజ్ఞల చెర వీడింది. పర్యావరణ విఘాతం మాట ఎట్లున్నా ఆయా గ్రామాల ప్రజలకు మాత్రం సీఎం కేసీఆర్ ప్రభుత్వం మంగళవారం తీసుకున్న జీవో 111 ఎత్తివేత నిర్ణయం పట్ల హర్షం. ఇన్నాండ్లుగా తమ భూములకు ధరలు పలకడం లేదంటున్న ఆ గ్రామాల దరిద్రం పోయినట్లే. రూ.లక్షల నుంచి రూ.కోట్లు కళ్ల చూసే రోజులు వచ్చేస్తున్నాయి. ఐతే ఈ ఆంక్షల ఎత్తివేతతో ఓ వైపు సంతోషం.. మరో వైపు భయం పట్టుకున్నది. కొన్ని బహుళ జాతి కంపెనీలకు తీవ్ర నష్టం కలిగించనుంది. ప్రస్తుతం పురోగతిలోని హై రైజ్ బిల్డింగులకు గడ్డుకాలమే. స్కై స్క్పేపర్స్ నిర్మిస్తున్నామంటూ ఉన్నతంగా ప్రచారం చేసుకున్న కంపెనీలకు చేదు వార్తగానే మారింది. ఇండ్లు, ప్లాట్ల ధరలను అమాంతంగా పెంచిన ప్రముఖ కంపెనీల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. డబుల్, త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్లను రూ.కోటి నుంచి రూ‌‌.1.75 కోట్లకు మార్కెట్లో పెట్టిన డెవలపర్స్ కి ఈ నిర్ణయం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు సేల్ కావడం అంత ఈజీ కాదని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంకాస్త దూరం.. 2 నుంచి 3 కి.మీ. దూరంలోనే నిర్మించబోయే ప్రాజెక్టుల ధరలు ఇక్కడితో పోలిస్తే సగం రేట్లకే ఫ్లాట్లు దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది. ఉదాహరణకు గచ్ఛిబౌలిలో త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ రూ.1.50 కోట్లు. అదే 2 కి.మీ. దూరం వెళ్తే వట్టినాగులపల్లి వస్తుంది. ఇప్పటి దాకా అడ్డంకిగా మారిన జీవోతో నిర్మాణాలు ఆగిపోయాయి. ఇప్పుడీ ప్రాంతంలో ఏడాది తిరిగే లోపు బహుళ అంతస్థుల ప్రాజెక్టులతో నిండిపోవడం ఖాయం. గచ్ఛిబౌలిలో ఎకరం రూ.60 కోట్లు.. అదే ఇక్కడైతే రూ.10 నుంచి రూ.20 కోట్లల్లో లభిస్తాయి. ఈ నేపధ్యంలో సగం ధరలోనే ఫ్లాట్లు దొరుకుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. పెరిగిన రవాణా సదుపాయం.. ఇంటింటికీ కారు, బైక్. దాంతో ఇంకాస్త దూరం వెళ్లి సొంతింటి కలను నెరవేర్చుకోవడం ద్వారా ఆర్ధిక వెసులుబాటుకు దోహదపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాజేంద్రనగర్​, చేవెళ్ల నియోజకవర్గాల్లోని 6 మండలాల్లో ‌84 గ్రామాల పరిధిలోని ‌1,32,600 ఎకరాల భూమికి జీవో 111 నుంచి విముక్తి కలిగింది.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు కష్టమే

హైటెక్ సిటీకి అత్యంత సమీపంలోని నానక్ రాంగూడ, గచ్ఛిబౌలి, మాదాపూర్, కొల్లూరు.. ప్రభుత్వ వేలం పాటల్లో అత్యధిక ధరలు పలికిన కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగి.. మొత్తంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి కష్టాలు తప్పవు. ఈ ప్రాంతంలో చేపట్టిన హై రైజ్ బిల్డింగుల్లో ఫ్లాట్లు సేల్ కావడం మాత్రం కష్టమేనని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇన్నాండ్లుగా పెద్ద మొత్తంలో వెచ్చించి స్థలాలు తీసుకోవడం.. అదే స్థాయిలో ఫ్లాట్ల ధరలను పెట్టి అమ్మేసి సొమ్ము చేసుకున్న బడా కంపెనీలకు కష్టకాలమే. చ.అ. ధర రూ.10 వేలకు పైగా ప్రకటించిన స్కై స్క్పేపర్స్ ప్రాజెక్టులకు మున్ముందు చుక్కలు కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు వినియోగదారులను ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే ఈ ప్రాంతంలో ప్రకటించిన స్కై స్క్పేపర్స్ ఔట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గండిపేట మండలం గండిపేట, వట్టినాగులపల్లి, ఖానాపూర్, మొయినాబాద్​మండలం అజీజ్ నగర్, చిలుకూరు, చిన్న మంగళారం, హిమాయత్ నగర్, కనకమామిడి, మొయినాబాద్, చిలుకూరు, సురంగల్, శంషాబాద్​ మండలం కొత్వాల్ గూడ, శాతంరాయి, ఊట్ పల్లి, తొండుపల్లి, పెద్ద షాపూర్, పాలమాకుల, ఘాన్సీమియాగూడ, ముచ్చింతల్ ప్రాంతాలకు బహుళ జాతి కంపెనీలు క్యూ కట్టడం ఖాయం.

వీటికి తెర?

కోకాపేటలో సౌతిండియాలోనే అత్యంత ఎత్తయిన భవనం 4.20 ఎకరాల్లో 57 అంతస్తులతో 235 ఫ్లాట్లతో నిర్మాణం.. లింగంపల్లిలో 53 అంతస్థుల భవనం, నానక్ రాంగూడలో 47 అంతస్థులు, కోకాపేటలో మరో 50 అంతస్థుల భవనం, ఫైనాన్షియల్​డిస్ట్రిక్ట్ లో మరో 47 అంతస్థుల భవనం.. ఇలా 25 అంతస్థులకు పైగా ఉండే 67 రెసిడెన్షియల్, 23 కమర్షియల్ భవనాలు రానున్నాయంటూ జరిగిన ప్రచారానికి తెర పడినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక ధరలు పెట్టి ఇక్కడ ఫ్లాట్లు కొనే బదులుగా దూరం వెళ్లి కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తారని అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు తెర పడనుంది.

కొట్టేసిన పెద్దలు

మూడు నెలల క్రితమే జీవో 111 ఎత్తేస్తారని ప్రభుత్వ పెద్దలకు, కొన్ని సంస్థలకు తెలిసినట్లుంది. అందుకే రైట్ టూ ప్రైవసీ అనే ఆప్షన్ ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేశారు. ఎవరికీ చిక్కకుండా ధరణి పోర్టల్ లాకర్ లో దాచేశారు. జీవో 111 ఎత్తేస్తామన్న సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో మరోసారి హామీ ఇచ్చిన నేపధ్యంలో బడాబడా కంపెనీలు, వ్యక్తులు ఖరీదైన స్థలాలను కొనుగోలు చేశారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో ఓ బడా కంపెనీకి చెందిన వారు 30 నుంచి 40 ఎకరాలు, పెద్దమంగళారంలో ఓ రాజ్యసభ సభ్యుడికి 30 ఎకరాలు, అజీజ్ నగర్ లో ఓ బడా పారిశ్రామికవేత్తకు 12 ఎకరాలు, హిమాయత్​నగర్ లో ఓ మంత్రి కుటుంబ సభ్యులు, బినామీలకు 12 ఎకరాలు, అజీజ్ నగర్ లో ఓ ఎమ్మెల్సీకి 4.20 ఎకరాలు, ఓ ఐఏఎస్ అధికారికి 2.20 ఎకరాలు, మేడిపల్లిలో ఓ ఎమ్మెల్సీకి 10 ఎకరాలు వంతున ఎంతో మందికి భూములు ఉన్నట్లు తెలిసింది. అజీజ్ నగర్ లో ఓ మంత్రి సోదరుడు, ఆయన బినామీలు 4 ఎకరాల్లో విల్లాలు కట్టి అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ముందుగానే కొందరు పెద్దలు మేల్కొని అధిక ప్రయోజనాన్ని పొందారు. అయితే జీవో 111 ఎత్తేయడం అంత ఈజీ కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకొని తీరుతుందని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అన్నింటికి మించి పారిస్ అగ్రిమెంట్ పై సంతకాలు చేసిన భారత్.. ​సహజ వనరుల విధ్వంసం చేసే ఏ నిర్ణయాన్ని తీసుకోబోం అని ప్రకటించింది. ఇప్పుడీ ప్యారీస్ ఒప్పందాన్ని ఉల్లంఘించే అంశంగా దీన్ని లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి.

జీఓ 111 పరిధిలోని గ్రామాలు

డివిజన్‌ మండలం గ్రామాల సంఖ్య

చేవెళ్ల చేవెళ్ల 8

చేవెళ్ల శంకర్‌పల్లి 6

చేవెళ్ల మొయినాబాద్‌ 25

చేవెళ్ల షాబాద్‌ 2

రాజేంద్రనగర్‌ శంషాబాద్‌ 39

రాజేంద్రనగర్‌ గండిపేట 3

మొత్తం 6 84

===

క్యాచ్ మెంట్ ఏరియా ఇదే

అంశం ఉస్మాన్‌సాగర్‌ హిమాయత్‌సాగర్‌

క్యాచ్‌మెంట్‌ ఏరియా 738 చ.కి.మీ. 1307 చ.కి.మీ

ఎత్తు 1920 మీ. 2256 మీ.

నిల్వ సామర్ధ్యం 4.4 టీఎంసీలు 4.13 టీఎంసీలు

గేట్లు 15 17

====


Tags:    

Similar News