వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

తెలుగురాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి.

Update: 2024-08-31 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ ఉపరితల ద్రోణికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా శనివారం సాయంత్రానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ అల్పపీడనం ఈ రోజు రాత్రి కళింగపట్నం దగ్గర తీర దాటనున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే అల్పపీడనం తీరం దాటే సమయంలో తీరం వెంబడి 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.

అలాగే తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు తెలంగాణలో 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లోని ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. జిల్లా కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు.


Similar News