వైరా రిజర్వాయర్ బఫర్ జోన్‌లో అక్రమంగా భవన నిర్మాణం
మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్ శికం భూమి బఫర్ జోన్‌లో అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు.
దిశ, వైరా : మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్ శికం భూమి బఫర్ జోన్‌లో అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఇటీవల శికం భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించిన అధికారులు ఈ అక్రమ నిర్మాణం గురించి మాత్రం కనీసం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వైరా రిజర్వాయర్ కుడి కాల్వ హెడ్ స్లూయిస్ సమీపంలో ఓ రెస్టారెంట్ పక్కన చేపడుతున్న భవన నిర్మాణానికి అధికార పార్టీ అండ ఉందని బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది.
మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నా అధికారులకు కనీసం పట్టించుకోవడం లేదు. పరదాల మాటన నిర్మాణ పనులు చక చక జరిగిపోతున్నాయి. వైరా మున్సిపాలిటీ అనుమతులు, నీటిపారుదల శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే అక్రమ భవన నిర్మాణం కొనసాగుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఎనిమిది నెలల క్రితం ఈ భవన నిర్మాణ పనులను మున్సిపాలిటీ అధికారులు నిలిపివేసి యజమానికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
అక్రమ భవన నిర్మాణం చేపడుతున్న యజమాని వైరా మున్సిపాలిటీ అనుమతులు లేకుండా, నీటిపారుదల శాఖ ఎన్ఓసి మంజూరీ కాకుండా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టానని లిఖిత పూర్వకంగా వాంగ్మూల పత్రం రాసి మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చారు. అనంతరం ఇటీవల వరకు భవన నిర్మాణ పనులను నిలిపివేసిన సదరు యజమాని గత కొద్ది రోజుల నుంచి మరల పనులు ప్రారంభించారు. మున్సిపాలిటీ పాలకవర్గంలోని కొంతమంది అండదండలతో గతంలో స్లాబు వేసి ఉన్న భవనానికి చుట్టూ పరదాలు కట్టి ప్రస్తుతం గోడ నిర్మాణ పనులు ఇతర పనులు చేపడుతున్నారు.
అయితే శిఖం భూముల్లో పేదలు వేసిన గుడిసెలను తొలగించిన అధికారులు ఈ అక్రమ భవన నిర్మాణం గురించి తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో తమకో న్యాయం పెద్దలకు మరో న్యాయమా అంటూ పేదలు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ సారూ.... అందరికీ సమన్యాయమే ఉండాలంటూ పేదలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణ పనులను నిలిపివేసి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.