పౌరసత్వం మనం ఇస్తే.. ముస్లిం దేశాలు ఎందుకు..? ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

మనది మోదీ కుటుంబంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో చాయిపే చర్చ కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది.

Update: 2024-04-10 05:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మనది మోదీ కుటుంబంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో చాయిపే చర్చ కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. నిజామాబాద్ ఎంపీ, బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్, రైతులు, స్థానికులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి అరవింద్ మాట్లాడుతూ.. ఫర్టిలైజర్, యూరియాలు వంటి వాటి మీద రైతులకు రూ.18వేలు, ప్రతి ఎకరాకు రూ.6వేలు కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు, జగిత్యాల జిల్లాకు మామిడిని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఎంపిక చేశాం అన్నారు. ఈ రెండు పంటల ఎగుమతులపై కేంద్రం చర్యలు తీసుకుంది అన్నారు.

అందులో భాగంగానే పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేశామని తెలిపారు. మంచి ధర లభించిందన్నారు. పసుపు బోర్డు వస్తే.. విత్తనాలు, భూసార పరీక్షలు మొదలు.. అన్ని అంశాలపై దృష్టి ఉంటుంది అని తెలిపారు. పరిమితిలో ఎరువులు వాడితే పసుపు ఎగుమతులకు డిమాండ్ ఉంటుందని, గోదాములు, పసుపు శుద్ధి కర్మాగారాలు వస్తాయి అని పేర్కొన్నారు. రైతులు, వినియోగదారులను కలిపే వ్యవస్థ ఏర్పాటు అవుతుందని, రైతుల వద్దకే కొనుగోలుదారు వచ్చి పంట కొనేలా వ్యవస్థ ఏర్పాటు అవుతుంది అని ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేవలం ఒకే ఒక్క రైల్వే బ్రిడ్జి ఉండేది.. నేను వచ్చాక ఏడు తీసుకొచ్చాను అని గుర్తుచేశారు.

అవినీతి కారణంగానే పార్లమెంట్ పరిధిలోని చక్కెర పరిశ్రమలు తెరుచుకోవడం లేదు అన్నారు. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నిజామాబాద్ సరైన ప్రదేశం అన్నారు. మోడీ రాక ముందు వరి మద్దతు ధర రూ.1300 ఉంటే.. మోడీ వచ్చాక రూ.2 వేలు దాటిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందని అన్నారు. ఆర్మూర్‌లోని జీవన్ మాల్ విషయంలో అధికారం వచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ హడావుడి చేశారని, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ నాయకులు, అధికారులకు కొంచెం చెల్లించగానే మళ్ళీ సప్పుడు లేదని ఆరోపించారు.

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు కట్టాలి, కరెంట్ డిపార్ట్మెంట్‌కు ఒక కిస్తి మాత్రమే కట్టాడు, ఇంకా ఆర్టీసీ, మున్సిపాలిటీకి కట్టాలి కానీ ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు తెలంగాణా లోనే పెద్దదని, పసుపు లావాదేవీల మీదనే యార్డుకు రూ.10-12 కోట్లు ఆదాయం వస్తుంది... ఏటా రూ.20 కోట్ల ఆదాయం ఉంటుంది అన్నారు. కానీ ఆ నిధులు నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఖర్చు చేస్తలేరని కొన్నేళ్లుగా ఆ నిధులు మొత్తం సిరిసిల్ల, సిద్ధిపేటకు వెళ్లిపోయాయి అని ఆరోపించారు.

నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఒక్క సౌలత్ ఏర్పాటు చెయ్యలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఏఏ 2019 లో తెస్తే... కాంగ్రెస్ లొల్లి పెట్టింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లిం లకు సైతం పౌరసత్వం ఇవ్వాలని ఆందోళన చేశాడు. ఇప్పుడు సీఏఏ అమలు చేస్తుంటే ఎన్నికలు ఉన్నాయని హిందువుల ఓట్ల కోసం జీవన్ రెడ్డి మౌనంగా ఉన్నాడు అన్నారు. ముస్లిం లకు పౌరసత్వం ఇస్తే ప్రత్యేకంగా ముస్లిం దేశాలు ఎందుకు మరి? అని అర్వింద్ ప్రశ్నించారు.


Similar News