Minister : మంచి పనులకు అడ్డుపడితే...సహించేది లేదు
మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొండా సురేఖ మాట్లాడుతూ.... బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి కేటీఆర్ కారణమన్నారు. అధికారం పోగానే పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా అవాకులు చివాకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ ఆక్రమణలు కేటీఆర్ పుణ్యమే అన్నారు. బాధ్యతగా ఉండి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీ కి సైతం హాజరు కావడం లేదన్నారు.
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో లేకపోవడం వల్ల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రక్రియ జరగడం లేదన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి సారథ్యంలో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి విడిపించుకోవడానికి బీ ఆర్ఎస్ బిజెపి చీకటి ఒప్పందం కుదుర్చుకుంది అన్నారు. అందులో భాగంగానే బీ ఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకుండా బిజెపిని గెలిపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకున్నారని స్పష్టం చేశారు.