IDL భూముల్లో ‘హై రైజ్డ్’ బిల్డింగ్స్.. ‘ప్రీ లాంచ్’ పేరుతో వెంచర్లు
కూకట్‌పల్లిలోని ఐడీఎల్ (గల్ఫ్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్)కు చెందిన భూముల్లో ‘హై రైజ్డ్’ బిల్డింగ్స్ అంటూ కొన్ని కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: కూకట్‌పల్లిలోని ఐడీఎల్ (గల్ఫ్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్)కు చెందిన భూముల్లో ‘హై రైజ్డ్’ బిల్డింగ్స్ అంటూ కొన్ని కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ‘ప్రీ లాంచ్’ పేరుతో వ్యాపారం చేస్తున్నాయి. అయితే రెవెన్యూ రికార్డుల్లోనై ఈ భూములు ఇప్పటికీ ‘ఐడీఎల్’ పేరుపైనే ఉండగా.. కంపెనీ ఎవరికైనా ఆ భూములను అమ్మేసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలా జరిగితే.. ఆ కంపెనీ పేరిట ఆ భూములు ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదన్న అనుమానాలు ‘రియల్’ వర్గాల్లో ఉన్నాయి. నిజంగానే ఐడీఎల్ భూములను ఏదైనా బడా కంపెనీ కొనుగోలు చేసిందా? లేదంటే కొంత మేరకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకుందా? అలా కాకుండా ఇతర కంపెనీలు కూడా ఐడీఎల్ భూములను కొన్నాయా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అసలు ఆ భూములను ఐడీఎల్ కు అమ్మే అధికారం ఉందా అనే దానిపైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఐడీఎల్ భూముల వ్యవహారం ఇలా..
- ఐడీఎల్ కంపెనీ 2002లో గల్ఫ్ అయిల్ కార్పొరేషన్ గా పేరు మార్చుకున్నది. ఐడీఎల్ కెమికల్స్ (గల్ఫ్ అయిల్ కార్పొరేషన్) కి 850.18 ఎకరాల స్థలమున్నది.
- కూకట్ పల్లిలో మహంతా బాబా సేవా దాస్ నుంచి దశాబ్దాల క్రితం 99 ఏండ్లకు లీజ్ తీసుకున్నారు. లీజ్ డీడ్ నం.366/1964, తేదీ.23.07.1964, 889/1966, తేదీ.14.09.1966, 1817/1978, తేదీ.20.04.1978 ప్రకారం జరిగింది. సర్వే నం.1010, 1020, 1024, 1025, 1026, 1027, 1029, 1030, 1036, 1037, 1038, 1039, 1040, 1041, 1042, 1066, 1067, 1068, 1069, 1070 వరకు ఏకంగా 528.11 ఎకరాలు. దీన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఈ ల్యాండ్ పూర్తిగా మ్యాగజైన్స్ డిటోనేటర్లు, టెస్టింగ్ గ్రౌండ్, ఎక్సో ప్లోజివ్ యాక్ట్ కింద సేఫ్టీ జోన్ గా ఉంది. అయితే ఈ భూమి మొత్తం ఉదాసీ మఠం (మాఫీ ఇనాం) ఎండోమెంట్ ఇన్ స్టిట్యూషన్ గా రిజిస్టర్ అయి ఉంది. అలాంటప్పుడు అమ్మకం సాధ్యమేనా? ఉదాసీ మఠం రిలీజియస్ ఎండోమెంట్ ఇన్ స్టిట్యూషన్ అని ఎండోమెంట్ చట్టం చెప్తున్నది.
- ఇండస్ట్రీస్ అవార్డ్ నం.డి/369/66, డి/1070/65, డి/1372/76 ప్రకారం 152.03 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులోనే ఎక్స్ ప్లోజివ్ జోన్, పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఐడీఎల్ నుంచి కూకట్ పల్లికి వెళ్లే వంద ఫీట్ల రోడ్డు, హైటెక్ సిటీకి వెళ్లే రోడ్డుకు పది ఎకరాలు పోయింది.
- జీవో 1314, తేదీ.28.08.1965 ప్రకారం సర్వే నం.1011/12, 1012లోని 170 ఎకరాల్లో ఐడీఎల్ కంపెనీ నుంచి 47.02 ఎకరాలు థర్డ్ పార్టీ చేతికి వెళ్లింది. మిగిలిన 134.02 ఎకరాలు మాత్రమే ఐడీఎల్ కంపెనీ చేతిలో ఉంది. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు, మేగజైన్స్, ఆర్ అండ్ డీ బిల్డింగ్స్ ఉన్నాయి.
నాలెడ్జ్ పార్క్ పేరిట..
గల్ఫ్ అయిల్ కంపెనీ ఈ ల్యాండ్ ని ఇండస్ట్రియల్ జోన్ నుంచి నాన్ ఇండస్ట్రియల్ జోన్ కి మార్చాలని దరఖాస్తు చేసుకున్నది. వంద ఎకరాల్లో నాలెడ్జ్ పార్క్ ను ఏర్పాటు చేస్తామన్నది. దీంతో ప్రభుత్వం పరిశీలించి జీవో 302, తేదీ.26.02.2009 ప్రకారం అనుమతులు జారీ చేసింది. అయితే నాలెడ్జ్ పార్క్ ను ఏర్పాటు చేయలేదు. దాంతో ఐడీఎల్ ల్యాండ్స్ అంశాన్ని సీసీఎల్ఏకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖ నం.ఎల్ సి 1/2281/2008, తేదీ.11.11.2015 ద్వారా రాశారు. తిరిగి 2019లో ప్రాథమికంగా విచారణ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో రెవెన్యూ వర్గాల్లో చర్చ లేకుండా పోయింది. నాలెడ్జ్ పార్క్ నిర్మిస్తామన్న కంపెనీ ఎందుకు నిర్మించలేదు? ఇప్పుడేమో కొన్ని కంపెనీలకు అమ్మేసిందన్న ప్రచారం జరుగుతుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
81 ఎకరాలకు క్లియరెన్స్
ఏమైందో ఏమో గానీ ఐడీఎల్ భూముల్లో 81.02 ఎకరాలకు క్లియరెన్స్ ఇచ్చారు. 2009 ఫిబ్రవరి 26న అప్పటి రెవెన్యూ శాఖ ఇండస్ట్రియల్ నుంచి నాన్ ఇండస్ట్రియల్ కి 100 ఎకరాలను మార్చేసిందని ఉదహరించారు. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఎండీ ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి దరఖాస్తు చేసుకున్నారని లేఖ నం.బి/1608/2019, తేదీ.13.01.2022 లో కూకట్ పల్లి తహశీల్దార్ పేర్కొన్నారు. అక్వాయిర్డ్, అలైనెటెడ్ కింద ఐడీఎల్ కి వివిధ సందర్భాల్లో సమకూరిన 181.04 ఎకరాల్లో 81.02 ఎకరాలకు క్లియరెన్స్ ఇచ్చారు. అయితే అప్పటి జీవోని అడ్డం పెట్టుకున్నారు. కానీ దాంట్లో నాలెడ్జ్ పార్క్ ని ఏర్పాటు చేస్తామన్నారన్న విషయాన్ని అధికారులు గుర్తించడం లేదు. అంటే నాలెడ్జ్ పార్క్ కి బదులుగా ఏ కమర్షియల్ యాక్టివిటీస్ కైనా వినియోగించుకుంటామని అనుమతులు పొందలేదు. కానీ గత ప్రభుత్వం వీటిని పక్కకు పెట్టి సదరు ల్యాండ్ ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. గల్ఫ్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ ఆధీనంలోని వంద ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతులు లభించాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ 59,459.89 గజాలు, 59,459.89 గజాల్లో వేర్వేరుగా అనుమతులు జారీ చేశారు. సర్వే నం.627, 629, 1011/1, 1011/2, 1011/3, 1011/4 లో 81.02 ఎకరాలు, 1011/12లో 18.38 ఎకరాలు.. మొత్తం 100 ఎకరాల భూమిని పీవోబీ జాబితా నుంచి తొలగించాలని కూకట్ పల్లి తహశీల్దార్ లేఖ నం.బి/1608/2019, తేదీ.13.01.2022 ద్వారా మల్కాజిగిరి ఆర్డీవోకు సమర్పించారు. అయితే ధరణి పోర్టల్ లో సర్వే నం.1012 నుంచి 1070 వరకు ఎందుకు కనిపించడం లేదనే సందేహాలు కలుగుతున్నాయి. కనీసం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులోనూ ఈ భూములను ప్రస్తావించకపోవడం గమనార్హం.
లావాదేవీలు జరిగాయా?
2020లోనే నెలకొల్పబడిన కొన్ని సంస్థలు ఈ ఐడీఎల్ భూములను కొనుగోలు చేశాయనే ప్రచారం ఉంది. అత్యంత ఖరీదైన స్థలాలను సదరు సంస్థ కొనుగోలుకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఎలా సమకూరిందో తెలియదు. అయితే కొనుగోలు చేసిన స్థలాలేవీ నాలా కన్వర్షన్ కాలేదు. ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. ఇంకొన్నేమో పీవోబీ జాబితాలో నమోదు చేశారు. అయితే కొన్ని సర్వే నంబర్లల్లో క్రయ విక్రయాలు చోటు చేసుకున్నాయి. కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో మాత్రం సదరు భూములు సీలింగ్ సర్ ప్లస్, ప్రభుత్వ భూములని పేర్కొన్నారు. పైగా లెక్క లేనన్ని కేసులు ఈ సర్వే నంబర్ల మీద చూపిస్తుండడం గమనార్హం. అన్నింటికీ మించి ఉదాసీ మఠం నుంచి భూములు లీజుకు పొందినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆ మఠం దేవాదాయ సంస్థగా ప్రచారంలో ఉంది. అలాంటప్పుడు సదరు భూములను అమ్ముకునేందుకు చట్టాలు అంగీకరిస్తాయా? లీజు పేరిట పూర్తిగా హస్తగతం చేసుకొని నాలెడ్జ్ పార్కు పేరిట ల్యాండ్ యూజ్ ని మార్చుకున్నారు. ఇప్పుడేమో ఇతర కంపెనీలకు ఏ చట్టం ప్రకారం అమ్మేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలపై మేడ్చల్ జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి ఆర్డీవో, కూకట్ పల్లి తహశీల్దార్ స్పష్టత ఇవ్వడం ద్వారానే రియల్ ఎస్టేట్ వర్గాల్లో అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశముంది.