కులగణనతోనే... బీసీలకు సామాజిక న్యాయం: ఎస్. అబ్దుల్ ఖాలిక్
వెనుకబడిన తరగతుల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుంది...
వెనుకబడిన తరగతుల సంక్షేమం విషయంలో కులగణన అనేది కీలకమైన అంశం. వెనుకబడిన తరగతుల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, బీసీ వర్గాల మేలు కోసం కొత్త పథకాల రూపకల్పనకు సైతం కులగణన దోహదపడుతుంది. మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జరగాలన్నా కులాలవారీగా జనాభాను లెక్కించి తీరాల్సిన అవసరం ఉంది. బీసీల నాయకత్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓబీసీలకు మేలు జరిగే విధంగా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అభినందనీయం.
కులగణనతో రాజకీయ ప్రత్యర్థులపై సమరానికి సన్నద్ధమైంది తెలంగాణ సర్కార్. దాదాపు ఏడాది కిందట తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని ప్రస్తావించారు. కులగణనతోనే సమాజంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే కులగణనకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇది శుభ పరిణామమే. ఆర్థిక, సామాజిక అసమానతలకు అడ్డుకట్ట వేయడంలో కులగణన ఎంతగానో తోడ్పడుతుంది. దేశంలోనే తొలిసారి కులగణన నిర్వహిచి సెహభాష్ అనిపించుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేసిన కులగణన సర్వేను తమ స్వంత రాష్ట్రంలో నితీశ్ కుమార్ విజయవంతగా చేపట్టారు. మొత్తం రెండు దశల్లో కులగణన ప్రక్రియను నితీశ్ కుమార్ పూర్తి చేశారు. బీజేపీ అసాధ్యమనుకున్నదానిని నితీశ్ కుమార్ సుసాధ్యం చేసి చూపించారు. యావత్ భారతదేశానికి బీహార్‌ను ఒక రోల్ మోడల్‌గా ఆయన తీర్చిదిద్దారు.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఒత్తిడి పెరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పలువురు బీసీ సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలోనూ కులగణన చేపట్టాలని కోరారు. బీసీ సంఘాల నేతల విజ్ఞప్తికి రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు కులగణనపై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల ప్రయోజనాల దృష్టితో చూస్తే, కులగణన అనేది చాలా ముఖ్యమైన అంశం. వెనుకబడిన తరగతుల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, వెనుకబడిన తరగతుల మేలు కోసం కొత్త పథకాల రూపకల్పనకు సైతం కులగణన దోహదపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో కూడా బీసీ వర్గాలకు కులగణన సహాయపడుతుంది. వాస్తవానికి దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జరగాలన్నా కులాలవారీగా జనాభాను లెక్కించి తీరాల్సిన అవసరం ఉంది.
కులగణన 1931తోనే ఆగిపోయిందా?
బీసీల నాయకత్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి. కులాలవారీగా లెక్కలు స్పష్టంగా లేనట్లయితే తమ మేలు కోసం తీసుకువచ్చే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని బీసీ వర్గాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ జనాభాలో కులపరంగా, ఆర్థికంగా, చదువుపరంగా వెనుకబడిన కులాలు 52 శాతం ఉంటారన్నది ఒక అంచనా. వీరికి కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ గతంలోనే సిఫార్సు చేసింది. 1931లో చివరిసారిగా జరిగిన కులగణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది. అప్పటి నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయాన్ని కచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్ బలంపుంజుకొంది. అయినా 2001, 2011 లో జరిగిన జనగణనలో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీకరించలేదు.
లెక్కలు తేలక నష్టపోతున్న బీసీలు !
దేశవ్యాప్తంగా కులగణన జరగకపోవడంతో వెనుకబడిన తరగతులు నష్టపోతున్నాయి. కులాలవారీ జనాభా లెక్కలపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బీసీ జనాభా లెక్కలు స్పష్టంగా లేకపోవడం వల్లనే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ణయించాలనే అంశంపై బీసీ కమిషన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతులకు ప్రయోజనాలు కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 1931 తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాలవారీగా జనగణన చేపట్టనే లేదు. ఏదిఏమైనా వెనుకబడిన తరగతుల జనాభాపై ఇప్పటివరకు అంచనాలే తప్ప ఒక స్పష్టత అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఓబీసీల శాతం ఎంత అనేది ఒక అంచనాగానే మిగిలిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఓబీసీలకు మేలు జరిగే విధంగా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అభినందనీయం.
(6వ తేదీ నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా)
- ఎస్. అబ్దుల్ ఖాలిక్,
63001 74320