కేసీఆర్ సభ గురించి నాకు తెలియదు.. నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నా: Bihar CM
ఖమ్మంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభకు దూరంగా ఉండడంపై జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభకు దూరంగా ఉండడంపై జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన...'కేసీఆర్ నిర్వహించిన సభ గురించి నాకు తెలియదు. నాకు ఎటువంటి సమాచారం లేదు. నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నాను. ఆయన పార్టీ సభకి ఆహ్వానం అందిన వారు సభకు వెళ్లారు. మీరు ఈ ప్రశ్నలు వారిని అడగాలి.'అని నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనంతరం టీఎంసీ ఎంపీ శాంతను సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ జాతీయ రాజకీయాల్లో విఫలమైందన్నారు. కాగా, జాతీయ స్థాయిలో తమ పార్టీ తొలి సభతో కాంగ్రెసేతర ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటు దిశగా తెలంగాణ సీఎం తొలి అడుగు వేశారని అన్నారు. ఇక థర్డ్ ఫ్రంట్ అనే ప్రశ్నే లేదని, కాంగ్రెస్ ప్రమేయం ఉన్న ఫ్రంట్ ఉండాలని అన్నారు. అప్పుడే 2024లో బీజేపీని ఓడించగలం అని ఆయన అభిప్రాయపడ్డారు. 'బీజేపీని ఓడించేందుకు ఎవరైనా వేదిక సిద్ధం చేసుకోవచ్చు.
బీజేపీని ఓడించడమే బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.. దీని తర్వాతే ఎవరిని బరిలోకి దింపాలనేది తేల్చవచ్చు'అని ఆయన అన్నారు. కేసీఆర్‌తో పాటు ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ స్థానం కోసం చాలా మంది పోటీ పడ్డారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా రేసులో ఉన్నారని గుర్తు చేశారు. పార్టీ జాతీయ స్థాయికి చేరుకున్న తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న తొలి భారీ బహిరంగ సభ అని...ఆయన్ను చాలా మంది ప్రధానమంత్రి పదవి ఆశించే వ్యక్తిగా చూస్తున్నారన్నారు.