హైడ్రాకు హైపవర్.. అమల్లోకి ఆర్డినెన్స్

హైడ్రా కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు అందుకు సమ్మతించని సమయంలోనే ఆర్డినెన్సుకు రాజ్‌భవన్ ఆమోదముద్ర పడడం గమనార్హం.

Update: 2024-10-05 03:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తక్షణం అమల్లోకి వచ్చింది. హైడ్రా కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు అందుకు సమ్మతించని సమయంలోనే ఆర్డినెన్సుకు రాజ్‌భవన్ ఆమోదముద్ర పడడం గమనార్హం. హైడ్రా వ్యవస్థకు చట్టబద్ధత లేదంటూ విపక్షాల నేతలు విమర్శలు చేస్తుండడం, హైకోర్టుల దాఖలైన పిటిషన్లలో పలువురు పేర్కొన్న సమయంలోనే ఆర్డినెన్సును రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ రూపంలో విడుదల చేయడం విశేషం. కూల్చివేతలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జరిగిన విచారణల్లో వివరణ ఇవ్వాలంటూ హైడ్రా కమిషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణ ఈ నెల 14న జరగనున్నందున ఆర్డినెన్సు విషయమై హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వివరించే అవకాశమున్నది. తక్షణం అమల్లోకి వస్తున్నట్లు గవర్నర్ ఆ ఆర్డినెన్సులో పేర్కొనడంతో ఈ నెల 3వ తేదీన గెజిట్‌ విడుదలైన తేదీ నుంచే ఉనికిలో ఉన్నట్లయింది.

ప్రత్యేకాధికారాలు

ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్సులో జీహెచ్ఎంసీ చట్టంలో ‘సెక్షన్ 374-బి’ను చేర్చడం ద్వారా హైడ్రా (ప్రత్యేక ఏజెన్సీ)కి అధికారాలు సంక్రమించాయి. వాటర్ బాడీస్ (చెరువులు, కుంటలు, కాల్వలు, నాలాలు)తో పాటు గ్రీనెరీ, పబ్లిక్ స్థలాలు (ఓపెన్ ప్లేస్), కమ్యూనిటీ భవనాలు (స్థలం సహా), రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, డ్రెయిన్‌లను పరిరక్షించడం, అన్యాక్రాంతం కాకుండా కాపాడడం ఈ ప్రత్యేక ఏజెన్సీ బాధ్యతలు, ఇంతకాలం జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కమిషనర్ దగ్గర ఈ అధికారాలు ఉండగా తాజా ఆర్డినెన్సుతో ప్రత్యేక ఏజెన్సీ బాధ్యుడికి వాటిని అప్పజెప్పడానికి ఆస్కారం కలిగింది. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్ ‘లైవ్‌’లో లేనందున ఆర్డినెన్సును రూపొందించినట్లు గవర్నర్‌కు పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. జీహెచ్ఎంసీ చట్టంలో సవరణ ఎందుకు చేయాల్సి వస్తున్నదో కూడా ఆ ఆర్డినెన్సులో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రానున్న ఆరు నెలల వ్యవధిలో అసెంబ్లీలో బిల్లు రూపంలో చర్చకు పెట్టి ప్రభుత్వం ఆమోదం పొందడం తప్పనిసరిగా మారింది.

జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374-బి పేరుతో కొత్తగా చేరే క్లాజ్‌తో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ అనే స్పెషల్ ఏజెన్సీకి ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో పాటు నీటి వనరులను ఆక్రమించిన కట్టడాలను తొలగించే అధికారం దక్కనున్నది. హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్)లో హైదరాబాద్ అనే పదం మినహా మిగిలినదంతా ఆర్డినెన్సులో చోటుచేసుకున్నది. వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరానికి వచ్చే ముప్పును నివారించేందుకు ప్రత్యేక ఏజెన్సీ ద్వారా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం ఆ ఆర్డినెన్సులో వివరించింది. రాష్ట్రం మొత్తం విస్తీర్ణం (1.12 లక్షల చ.కి.మీ.)లలో హైదరాబాద్ నగరం కేవలం 0.58% (650 చ.కి.మీ) మాత్రమేనని, కానీ రాష్ట్ర మొత్తం ఎకానమీ (జీఎస్‌డీపీ), పన్నుల వసూళ్లలో మాత్రం దాదాపు మూడవ వంతుగా ఉన్నదని వివరించింది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న హైదరాబాద్ నగరాన్ని, ఇక్కడ జీవిస్తున్న కోటి మందికిపైగా జనాన్ని ప్రకృతి వైపరీత్యాలు, వరదల నుంచ రక్షించడానికి అన్యాక్రాంతం చేసిన ప్రభుత్వ భూములను, చెరువుల కబ్జాలను తొలగించాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నది.

చట్ట సవరణ ద్వారా కొత్తగా ఉనికిలోకి వస్తున్న స్పెషల్ ఏజెన్సీ ఇకపైన ఇలాంటి వైపరీత్యాల నుంచి ఎలాంటి పరిరక్షణా చర్యలు తీసుకోవాలి? ఎలాంటి వ్యూహాన్ని రూపొందించాలి? ఇకపైన ఆక్రమణలకు గురి కాకుండా ఎలా ప్రొటెక్ట్ చేయాలి? తదితర అంశాలు ప్రభుత్వానికి తప్పనిసరిగా మారిందని ఆ ఆర్డినెన్సులో వివరించింది. ‘ఫార్చూన్-500’ కంపెనీల్లో కీలకమైన ఫార్మా, బయో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని అనుబంధ సర్వీసులు.. ఇలాంటివన్నీ హైదరాబాద్ నగరాన్ని ఒక గమ్యస్థానంగా భావిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సిటీని కాపాడుకోవడం, వాణిజ్య కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని, అందువల్లనే జీహెచ్ఎంసీ చట్ట సవరణ ద్వారా ప్రత్యేక ఏజెన్సీని రూపొందించాల్సిన అవసరం ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆర్డినెన్సులో వివరించింది. ఈ వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ ఆమోదం తెలిపారని, తక్షణం (అక్టోబరు 3 నుంచి) అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌లో స్పష్టం చేసింది.


Similar News