హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ఇక నేరుగా వారినే కట్టడి చేసేలా ప్లాన్

కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా(Hydra) అక్రమ నిర్మాణాల నివారణకు మరో అడుగు ముందుకేసింది.

Update: 2024-09-24 02:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా(Hydra) అక్రమ నిర్మాణాల నివారణకు మరో అడుగు ముందుకేసింది. అక్రమ నిర్మాణాలను కొనుగోలు చేయకుండా రుణాలిచ్చే సంస్థలను నియంత్రించాలని హైడ్రా భావిస్తోంది. కత్వా, చెరువు ఎఫ్టీఎల్(FTL) పరిధిలో అక్రమంగా నిర్మించిన విల్లాలకు ఓ సంస్థ రుణాలిచ్చింది. సాధారణంగా బ్యాంకు రుణం రావాలంటే లేఅవుట్ కాపీ, బిల్డింగ్ పర్మిషన్, ఈసీ, రిజిస్టర్ డాక్యుమెంట్ మాత్రమే అడుగుతున్నారని బాధితులు చెబుతున్నారు. అయితే ఆ నిర్మాణం బఫర్ జోన్, ఎఫ్టీఎల్ లో ఉందా? దీనికి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీ ఉందా? విషయాలను పట్టించుకోవడం లేదు. ‘కస్టమర్లకు లోన్లు కావాలి.. బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలకు టార్గెట్ పూర్తి కావాలి’ అనే ఉద్దేశంతో పని చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. వీటన్నింటి నేపథ్యంలో అడ్గగోలుగా లోన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడానికి హైడ్రా సిద్ధమైంది.

త్వరలో సమావేశం..

మల్లంపేట్‌లోని కత్వా చెరువు, గుట్టల బేగంపేట్‌లోని సున్నం చెరువు, అమీన్‌పూర్ చెరువు, కూకట్ పల్లి నల్లచెరువు, ఆయా ప్రాంతాల్లో కూల్చివేసిన భవనాలు, విల్లాలను పరిశీలిస్తే అన్నింటికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలిచ్చినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. కూల్చివేసిన భవనాలు, విల్లాలకు ఏఏ బ్యాంకులు, సంస్థలు రుణాలిచ్చాయో జాబితా తయారు చేస్తున్నారు. సంబంధిత సంస్థలతో హైడ్రా త్వరలో సమావేశమయ్యే అవకాశముంది. వీటితోపాటు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు హైడ్రా లేఖ రాయనున్నట్టు సమాచారం.

లీగల్ టీమ్ రెడీ..

కోర్టు కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు, స్టేలను వేకేంట్ చేయడానికి నలుగురి సభ్యులతో కూడిన లీగల్ టీమ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అన్ని కోర్టులకు సంబంధించిన కేసులను ఈ టీమ్ లీడ్ చేయనుంది. దీంతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర ప్రాంతాల్లో గుర్తించి అధ్యయనం చేస్తున్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలకు సంబంధించిన కోర్టు కేసులను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.


Similar News