Hydra: హైడ్రాను మాకూ విస్తరించండి.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రిక్వెస్ట్

హైడ్రా చేస్తున్న పని బాగుందని, తమ నియోజకవర్గానికి కూడా హైడ్రాను విస్తరించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజ్ఞప్తి చేశారు.

Update: 2024-08-26 09:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా చేస్తున్న పని బాగుందని, తమ నియోజకవర్గానికి కూడా హైడ్రాను విస్తరించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిధిలో చెరువుల కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ చాలా బాగా పని చేస్తుందని, హైడ్రా ఏర్పాటుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ఏ ప్రభుత్వం ధైర్యం చేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లాగే షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా ఎన్నో చెరువులు కుంటలు కబ్జాలకు గురయ్యాయని, రియల్టర్లు ఫీడర్ ఛానెళ్లు ధ్వంసం చేసి భూములు అక్రమించారని తెలిపారు.

దీనిపై మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు కూడా పలుమార్లు తన ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. అలాగే తమ నియోజకవర్గంలోని నందులకత్వ, బొబ్బిలి చెరువుకు వచ్చే ఫీడర్ కాలువలను, సర్ ప్లస్ వాటర్ ఏరియాను రియల్టర్లు ధ్వంసం చేశారని, దీంతో ఆయా చెరువులకు నీరు అందడం లేదని, ఇలా చాలా చెరువులను ఆక్రమణలకు గురి చేసి అక్రమ కట్టడాలు కట్టారని తెలిపారు. ఆక్రమణలకు గురైన వాటిని పునరుద్దరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, అందుకే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను తమ షాద్ నగర్ నియోజకవర్గానికి కూడా విస్తరించాలని కోరారు. అంతేగాక హైడ్రాను వీలైతే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించి, చెరువులను కాపాడి భావితరాలకు భరోసా కల్పించాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు.


Similar News