జన్వాడ ఫామ్‌హౌజ్‌ను కూల్చట్లేదు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైడ్రా(HYDRA) బాధ్యత అని కమిషనర్ ఏవీ రంగనాథ్(Ranganath) అన్నారు. శనివారం ఆయన కూల్చివేతలపై మీడియాతో మాట్లాడారు.

Update: 2024-09-28 12:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైడ్రా(HYDRA) బాధ్యత అని కమిషనర్ ఏవీ రంగనాథ్(Ranganath) అన్నారు. శనివారం ఆయన కూల్చివేతలపై మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యమని తెలిపారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులే అని వెల్లడించారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. అమీన్‌పూర్‌లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి.. ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారు.. భవనంలో ఆస్పత్రి లేకపోయినా ఆస్పత్రి ఉన్నట్లు ప్రచారం చేశారు.

కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారని అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని అన్నారు. ఇప్పటివరకు తాము కూల్చిన ఏ భవనానికి కూడా అనుమతులు లేవని స్పష్టం చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు తప్పుడు సర్వే నెంబర్లతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నీ తెలిసినా కూడా హైడ్రా చర్యలు తీసుకోకపోతే.. ప్రజలే బాధితులు అవుతారని చెప్పారు. హైడ్రా అంటే బూచి కాదని.. భరోసా ఇచ్చే సంస్థ అని తెలిపారు. ఇప్పటివరకు హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని వెల్లడించారు. ఆక్రమణల్లో పేదల ఇళ్లు ఉంటే.. వాటి జోలికి వెళ్లడం లేదని తెలిపారు. జన్వాడ ఫామ్‌హౌజ్‌ 111 జీవో పరిధిలో ఉందని.. అది హైడ్రా పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. అది హైడ్రా పరిధిలోనిది అయితే తప్పకుండా కూల్చేస్తామని అన్నారు. తాము సైలెంట్‌గా ఉండటం లేదని.. ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని తెలిపారు. కూల్చివేతలే కాదని.. చెరువులు, కుంటలను మళ్లీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, జన్వాడ ఫామ్‌హౌజ్ కేటీఆర్‌కు సంబంధించినది అని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.


Similar News