తెలంగాణ మహిళలకు పెద్దపీట.. సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం
ఫ్యామిలీ డిజిటల్ కార్డు(Family Digital Cards)లపై సంబంధిత అధికారులతో సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఫ్యామిలీ డిజిటల్ కార్డు(Family Digital Cards)లపై సంబంధిత అధికారులతో సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒకే కార్డులోకి రేషన్, హెల్త్, ఇతర పథకాలు వర్తింపజేస్తామని అన్నారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హుల నిర్ధారణ చేస్తామని వెల్లడించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా, అర్హులైనవారందరికీ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్డు ద్వారానే లబ్ధిదారులు ఎక్కడినుంచైనా రేషను వస్తువులను తీసుకోవచ్చని, ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చని, ఆ దిశగా ఉపయోగపడేలా ఈ కార్డులు ఉంటాయని స్పష్టం చేశారు. వైద్యారోగ్య అవసరాలకు చికిత్స పొందే సమయానికి సదరు వ్యక్తికి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డు ద్వారా డాక్టర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఈ డిజిటల్ కార్డులో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవచ్చని వెల్లడించారు.